Sai Pallavi | తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తన నటన, డ్యాన్స్‌లతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సాయి పల్లవి ‘ఏక్ దిన్’ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయం కావడం, ఆమిర్ ఖాన్ స్వయంగా నిర్మాణం వహించడం వంటి అంశాలతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మే 1న విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. రిలీజ్ మొదటి రోజే మిశ్రమ స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, తొలి రోజు దేశవ్యాప్తంగా ఈ సినిమా కేవలం రూ. 1.37 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే సాధించింది. రెండో రోజు ఈ సంఖ్య మరింత తగ్గి సుమారు రూ. 1 కోటి వద్ద ఆగిపోయింది. రెండు రోజుల్లో కలిపి సుమారు రూ. 2.15 కోట్ల నెట్, రూ. 2.57 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది.
ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ చిత్రానికి నిరాశే ఎదురైంది. విదేశాల్లో రెండు రోజుల్లో కేవలం రూ. 25 లక్షల వసూళ్లు మాత్రమే రావడంతో, ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు రూ. 2.82 కోట్ల గ్రాస్‌కే పరిమితమయ్యాయి. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు డిజాస్టర్ దిశగా పయనిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం థాయ్ మూవీ ‘వన్ డే’కి అధికారిక రీమేక్‌గా తెరకెక్కింది. కథ పరంగా చూస్తే, జపాన్ నేపథ్యంలోని ఓ సున్నితమైన ప్రేమకథ. ఐటీ ఉద్యోగి దినేష్ (జునైద్ ఖాన్) తన సహోద్యోగి మీరా (సాయి పల్లవి)పై ప్రేమ పెంచుకుంటాడు. కానీ తన ప్రేమను చెప్పలేకపోతాడు. ఒక సందర్భంలో మీరా ‘ట్రాన్సియెంట్ గ్లోబల్ ఆమ్నీషియా’ అనే సమస్యతో 24 గంటల పాటు జ్ఞాపకశక్తిని కోల్పోతుంది. ఆ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఆమెను ప్రేమలోకి దింపాలనే ప్రయత్నమే కథకు కేంద్రబిందువుగా ఉంటుంది.
అయితే కథలో బలం లేకపోవడం, కథనం నెమ్మదిగా సాగడం వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. సాయి పల్లవి తన నటనతో మెప్పించినప్పటికీ, జునైద్ ఖాన్ అనుభవలేమి స్పష్టంగా కనిపించిందని విమర్శలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం మైనస్‌గా మారింది. అలాగే సినిమాలో గుర్తుండిపోయే ట్విస్టులు లేకపోవడం, బలమైన భావోద్వేగాలు లేకపోవడం, పాటలు కూడా ఆకట్టుకోకపోవడం సినిమాకు మరింత నష్టాన్ని కలిగించాయి. జపాన్‌లోని అందమైన లొకేషన్లు మాత్రమే కొంతమేరకు విజువల్‌గా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్లో యాక్షన్, స్పై సినిమాల ట్రెండ్ నడుస్తున్న సమయంలో, సున్నితమైన ప్రేమకథను చెప్పాలనే ప్రయత్నం మంచి ఆలోచన అయినప్పటికీ, దాన్ని ప్రేక్షకులను కట్టిపడేసేలా తెరకెక్కించడంలో విఫలమయ్యారు. వీక్‌డేస్‌లో కలెక్షన్లు మరింత తగ్గే అవకాశం ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టెక్కడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
