దిల్లీ పేలుడు ఘటన వెనుక ఉన్న ప్రతి ఒక్కర్ని వేటాడాలని ఆదేశించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఎర్రకోట సమీపంలో పేలుడు నేపథ్యంలో.. దేశ రాజధాని దిల్లీతోపాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భద్రతపై నేడు ఉన్నతాధికారులతో రెండు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. పేలుడు అనంతర పరిస్థితులను ఉన్నతాధికారులు ఈ సందర్భంగా కేంద్రమంత్రికి వివరించారు.
‘‘దిల్లీ కారు పేలుడుపై సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాను. ఈ ఘటన వెనుక ఉన్న ప్రతి నిందితుడిని వేటాడాలని వారికి ఆదేశించాను. ఈ పేలుడులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతాయి’’ అని సమావేశాల అనంతరం అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ ఘటనపై అత్యున్నత దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయని, సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నాయని అంతకుముందు చెప్పారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ ఈ పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఉదయం నిర్వహించిన భేటీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్, దిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ వర్చువల్‌గా హాజరయ్యారు. రెండో సమావేశంలోనూ దాదాపు ఈ ఉన్నతాధికారులే పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
The post Amit Shah: దిల్లీ పేలుళ్ళ వెనుక ఉన్న ప్రతి ఒక్కర్ని వేటాడతాం – అమిత్ షా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
