AP Govt- Google Deal: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ కంపెనీ ఈరోజు ( అక్టోబర్ 14న) ఢిల్లీలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనుంది. విశాఖపట్నంలో రూ.88,628 కోట్ల గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంఓయూ కుదరనుంది. దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రం ఏర్పాటుకు ‘‘గూగుల్ ఏఐ హబ్’’ పేరుతో ఏపీ సర్కార్ విశాఖపట్నంలో శ్రీకారం చుట్టనుంది. ఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో ఉదయం 10గంటలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్ సమక్షంలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నతస్థాయి బృందం ఈ ఎంఓయూపై సంతకాలు పెట్టనున్నాయి.
Read Also: 10,000mAh బ్యాటరీ, 12.1 అంగుళాల డిస్‌ప్లేతో Vivo Pad 5e లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
అయితే, ఏపీని ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలపడం కోసమే చంద్రబాబు సర్కార్ ఈ ఒప్పందం చేసుకుంటుంది. ఇక, మంత్రి లోకేశ్ గతేడాది అక్టోబరు 31న యూఎస్ టూర్ సందర్భంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా.. అనంతరం గూగుల్ ప్రతినిధులతో పలు దఫాలుగా జరిపిన చర్చలు ఇప్పుడు కార్యరూపం దాల్చుతున్నాయి. ఈ కంపెనీ ద్వారా దేశంలో కృత్రిమ మేధస్సు ఆధారిత అభివృద్థిలో ఏపీ కీలకంగా వ్యవహరించనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా గూగుల్ రాబోయే ఐదేళ్లలో సుమారు రూ.88,628 కోట్ల పెట్టుబడి ఏపీలో పెట్టనుంది. ఇది ఆసియాలోనే గూగుల్ చేపట్టే అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా చెప్పాలి. ఈ పెట్టుబడితో వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి. యువత కోసం ఏఐ నైపుణ్యాభివృద్థి కార్యక్రమాలు అమలు చేయనున్నారు.
