మొంథా తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్తు సరఫరా వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. బుధవారం కోనసీమ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విద్యుత్ పునరుద్ధరణ చర్యల పురోగతిని ఆయన వివరించారు. అన్ని సెక్షన్ కార్యాలయాలకు జనరేటర్లు, పోల్ డ్రిల్లింగ్ యంత్రాలు, పవర్ సాలు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వంటి అవసరమైన సామగ్రి, సిబ్బందిని ముందస్తుగా అందుబాటులో ఉంచడం వల్ల పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. అమలాపురం డివిజన్ పరిధిలోని ఉప్పలగుప్తం, ఐనవోలు, అమలాపురం సబ్‌స్టేషన్లలో జరుగుతున్న పునరుద్ధరణ పనులను సీఎండీ పృథ్వీతేజ్ సమీక్షించారు.
మొంథా తుపాను ప్రభావానికి సంస్థ పరిధిలోని 11 సర్కిళ్లలో రూ.10.47 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎండీ తెలిపారు. 7,973 మంది విద్యుత్ సిబ్బంది 523 బృందాలుగా ఏర్పడి నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. వర్షాలు, ఈదురుగాలుల కారణంగా తెగిపడిన విద్యుత్ వైర్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, పాడైపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్తు అంతరాయాలకు సంబందించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబరు 1912కు, కంట్రోలు రూమ్ ఫోన్ నెంబర్లు – కార్పొరేట్ ఆఫీసు-8331018762, కాకినాడ-9490610856, పెద్దాపురం-9493178728, జగ్గంపేట-9490610097, అమలాపురం-9490610101, రామచంద్రపురం-9493178821, నరసాపురం -7382050943, భీమవరం- 9490610143కు ఫోన్ చేసి సంబంధిత సెక్షన్ కార్యాలయాలకు తెలియజేసి పరిష్కారం పొందవచ్చని వినియోగదారులకు సీఎండీ విజ్ఞప్తి చేశారు.
కోనసీమ జిల్లాలో 20వేల ఎకరాల్లో వరి పంట నష్టం – మంత్రి అచ్చెన్నాయుడు
మొంథా తుపాను తీవ్రత ఊహించినంతగా లేకపోయినప్పటికీ విద్యుత్తు సరఫరా, రాకపోకలకు ఇబ్బంది కలిగించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం అమలాపురం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఈదురు గాలుల వల్ల కోనసీమ జిల్లావ్యాప్తంగా 300 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని, వాటి పునరుద్ధరణ పనులు దాదాపు పూర్తయ్యాయని, ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా 134 కిలోమీటర్ల మేర రహదారులపై నేలకొరిగిన భారీ వృక్షాలను తొలగించి రాకపోకలు పునరుద్ధరించినట్టు చెప్పారు.
ఆర్టీసీ బస్సుల రాకపోకలు యథావిధిగా సాగించనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 400 పునరావాస కేంద్రాలు నిర్వహించి 10,150 మందికి ఆశ్రయం కల్పించినట్టు చెప్పారు. వీరిలో కుటుంబానికి రూ.3 వేల చొప్పున, ఒంటరి సభ్యులకు రూ.1000 చొప్పున పరిహారం పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. గత ఐదు రోజులుగా సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు, చేనేత కార్మికులకు కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల ఎకరాల్లో వరి పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసినట్టు చెప్పారు. సమావేశంలో మొంథా తుపాను సహాయక చర్యల ప్రత్యేక అధికారి వి.విజయరామరాజు, జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, ఎంపీ జి.హరీష్ మాధుర్, ఎస్పీ రాహుల్ మీనా, జాయింట్ కలెక్టర్ నిశాంతి, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, నిమ్మకాయల చినరాజప్ప, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మెట్ల రమణబాబు, డీఆర్‌వో కె.మాధవి తదితరులు పాల్గొన్నారు.
The post APEPDCL: మొంథా తుపాను ప్రభావంతో ఏపీఈపీడీసీఎల్ కు 10 కోట్లు నష్టం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
