Bellamkonda Sreenivas | ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం చేసుకున్నారు. తాను ప్రేమించిన కావ్యా రెడ్డితో ఆయన ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు, సన్నిహితులు సమక్షంలో ఈ కార్యక్రమం సాదాసీదాగా జరిగింది.ఈ నిశ్చితార్థ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన కొద్దిమంది ప్రముఖులు హాజరయ్యారు. హీరోయిన్ సంయుక్త మీనన్, దర్శకుడు బోయపాటి శ్రీను సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఎంగేజ్మెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది.
కావ్యా రెడ్డి హైదరాబాద్‌కు చెందిన యువతి. ఆమెకు సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదు. ఆమె కుటుంబం న్యాయ వృత్తితో అనుబంధం కలిగి ఉంది. కావ్యా రెడ్డి తాత జడ్జిగా పనిచేయగా, ఆమె తండ్రి ప్రస్తుతం లాయర్‌గా సేవలందిస్తున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. అయితే వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందన్న విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే పెళ్లి తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకీ నాయక, కవచం, సీత, రాక్షసుడు వంటి యాక్షన్ మరియు లవ్ స్టోరీలతో ప్రేక్షకులను అలరించారు. గత ఏడాది విడుదలైన భైరవం, కిష్కింధపురి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు.
ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా ‘హైందవ’లో నటిస్తున్నారు. అలాగే లోకమాన్య దర్శకత్వంలో ‘రామమ్’ సినిమాలోనూ నటిస్తున్నారు. ఇదే కాకుండా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టైసన్ నాయుడు’ చిత్రంలో కూడా హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నారు.
