Bhatti Vikramarka : బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న వేళ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైకోర్టు తీర్పుపై స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ అందిన తర్వాత పూర్తి అవగాహన చేసుకుని తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “హైకోర్టు 2025 సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు జరపాలని స్పష్టంగా చెప్పింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మేము గట్టి ప్రయత్నం చేశాం. కానీ, 2018లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్ పరిమితిని 50 శాతం కట్‌ఆఫ్ చేసి చట్టం చేసింది. ఆ సమయంలో వారు ఓబీసీ రిజర్వేషన్‌పై ఎలాంటి కసరత్తు చేయలేదు” అని అన్నారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “ఇప్పుడు బీజేపీ, బీఆర్‌ఎస్ రెండు పార్టీలు మాపై నిందలు వేస్తున్నాయి. కానీ ప్రజలు అమాయకులు కాదు, బీసీ సంఘాల నాయకులు అంతకంటే అమాయకులు కాదు. ఎంపిరికల్ డాటా లేకుండా రిజర్వేషన్ ఇవ్వలేమని కోర్టు అప్పటికే చెప్పింది. అందుకే మేము శాస్త్రీయంగా సిపెక్ సర్వే నిర్వహించాం. దానిని బిల్లు రూపంలోకి తెచ్చాం. ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడ్డాం” అని స్పష్టం చేశారు.
“మేము అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన బిల్లును ఆపింది ఎవరు? బీజేపీ ప్రభుత్వం కదా? వాళ్లే బీసీలకు న్యాయం అడ్డుకుంటున్నారు. బీఆర్‌ఎస్ 50 శాతం స్లాబ్ దాటకుండా చట్టం చేసిందంటే అదే నిరూపణ. బీసీల నోటికాడి ముద్దను రెండు పార్టీలు లాక్కున్నాయి” అని భట్టి విమర్శించారు.
“గవర్నర్ బిల్లును మూడు నెలలు ఆపి ఉంచినా, నిర్ణయం తీసుకోకపోతే అది చట్టంగా మారినట్టే. అందుకే మేము జీఓ 9 జారీ చేశాం. సర్వేలో పాల్గొనని పార్టీలు ఇవాళ మాపై విమర్శలు చేస్తూ తగుదనమా అంటున్నాయి. మిమ్మల్ని ప్రజలు క్షమించరు. న్యాయస్థానాల్లో, రాజకీయంగా కూడా 42 శాతం రిజర్వేషన్ కోసం మా పోరాటం కొనసాగుతుంది” అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
“మేము బీసీ రిజర్వేషన్ల కోసం ధర్నాలు చేసినప్పుడు బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఎక్కడ ఉండేవి? అప్పట్లో మాతో రాలేదు, ఇప్పుడు రండి అంటున్నారు” అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
