బిహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడుతోన్న కొద్దీ అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ తరుణంలో అధికార, విపక్ష పార్టీల్లో టికెట్ల పంచాయితీ మొదలైంది. ఎట్టిపరిస్థితుల్లో తమకు టికెట్ దక్కాలని భావిస్తోన్న కొందరు ఏకంగా సీఎం నీతీశ్ కుమార్ నివాసం వద్ద ధర్నాకు దిగారు. ఈ తరుణంలో రాజధాని నగరం పట్నాలోని ఆయన నివాసం వద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.
పార్టీ టికెట్ కోసం నీతీశ్ ఇంటివద్ద జేడీయూ (JDU) పార్టీకి చెందిన గోపాల్‌పుర్ ఎమ్మెల్యే గోపాల్ మండల్ ధర్నాకు దిగారు. ఈసారి టికెట్ లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న అంచనాల నేపథ్యంలో ఆందోళన చేపట్టారు. ఆయన ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంగళవారం ఉదయం తన మద్దతుదారులతో కలిసి సీఎం నివాస ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ముందస్తు అపాయింట్‌మెంట్ లేదని భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ‘‘సీఎం నుంచి పార్టీ గుర్తు వచ్చేవరకు నేను వెనక్కి తగ్గను. ఆయన మా పార్టీకి సుప్రీం. ఆయన్ను కలిసేవరకు ఇక్కడి నుంచి వెళ్లను. నాపై లాఠీఛార్జి చేస్తానంటే చేసుకోండి’’ అని మీడియాతో మాట్లాడారు. ఈ తరుణంలో సీఎం నీతీశ్ కుమార్ నివాసం వద్ద భద్రతను పెంచారు. ఎవరూ సీఎం నివాసంలోకి ప్రవేశించకుండా భద్రతా సిబ్బంది చర్యలు చేపట్టారు. అయినా సరే, పలువురు నేతలు, పార్టీ కార్యకర్తలు అక్కడికి రావడం మాత్రం ఆగలేదు. ఇంటిబయట వారు బైఠాయించారు.
లాలూ ఇచ్చిన టిక్కెట్లను వెనక్కి తీసుకున్న తేజస్వి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష ‘ఇండియా’ కూటమి సీట్ల పంపకాల వ్యవహారం ఇంకా తేలకుండానే కూటమి ప్రధాన భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ (RJD) పలువురికి టిక్కెట్లు ఇవ్వడం, ఆ తర్వాత కొద్దిసేపటికే దానిని నిలిపి వేసి, ఇచ్చిన టిక్కెట్లను వెనక్కి తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఐఆర్సీటీసీ హోటల్ కుంభకోణంలో కోర్టుకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన లాలూప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి సోమవారం సాయంత్రం తిరిగి బిహార్ చేరుకున్నారు. 10, సర్క్యులర్ రోడ్డులోని రబ్రీ బంగ్లా వద్ద అప్పటికే పెద్దఎత్తున టిక్కెట్ ఆశావహలు చేరుకున్నారు. లాలూ దంపతులు వచ్చిన కొద్దిసేపటికే పలువురు ఆశావహుల చేతికి పార్టీ సింబల్స్ రావడం, వారి ముఖాలు సంతోషంతో వెలిగిపోవడం కనిపించింది.
ఆ తర్వాత కొద్దిసేపటికే ఢిల్లీ నుంచి వచ్చిన తేజస్వి యాదవ్ జరిగిన విషయం తెలుసుకుని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కూటమి భాగస్వాముల మధ్య సీట్ల కేటాయింపులు ప్రక్రియ పూర్తి కాకుండానే పార్టీ అభ్యర్థుల ఫోటోలు, వీడియోలు బయటకు వస్తే భాగస్వామ్య పక్షాలు ఏమనుకుంటారని లాలూకు నచ్చచెప్పి టిక్కెట్ల పంపిణీని నిలిపివేయించారు. అప్పటికే టిక్కెట్లు అందుకున్న నేతలను సాంకేతిక కారణాల వల్ల వాటిని తిరిగి ఇచ్చేయాల్సిందిగా తేజస్వి ఆదేశించారు. కాగా, ‘ఇండియా’ కూటమి భాగస్వాములకు సీట్ల కేటాయింపుపై ఆర్జేడీ మరికొద్ది గంటల్లోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రఘోపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వి బుధవారంనాడు నామినేషన్ వేయనున్నట్టు చెబుతున్నారు.
రాహుల్ గాంధీ, తేజస్వికి కోర్టు సమన్లు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ కు బిహార్‌లో షేక్‌పుర జిల్లా కోర్టు సమన్లు ఇచ్చింది. కాంగ్రెస్ నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సమన్లు ఇచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ప్రకటించిన జాబితాను వెనక్కి తీసుకున్న సీపీఐఎంఎల్
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే 18 మంది అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ప్రకటించిన సీపీఐ (ఎంఎల్) తాజాగా ఆ జాబితాను ఉపసంహరించుకుంది. కొన్ని సీట్లకు సంబంధించి కూటమి భాగస్వాముల మధ్య చర్చలు కొనసాగుతున్నందున ముందుగా ప్రకటించిన జాబితాను ఉపసంహరించుకుంటున్నామని, సవరించిన జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు. కాగా, సీట్ల పంపకాలపై విపక్ష మహాకూటమిలో అనిశ్చితి కొనసాగుతోంది. మహాకూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర చిన్న పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి చర్చలు ఇంకా కొనసాగుతుండటంతో అధికారిక ప్రకటనలో జాప్యం జరుగుతున్నట్టు చెబుతున్నారు.
సీట్ల పంపకాల్లో ఎన్డీయే ముందంజ
ఎన్డీయే కూటమి ఇప్పటికే సీట్ల పంపకాలపై అధికార ప్రకటన చేయడంతో పాటు అభ్యర్థుల జాబితాలను కూడా ప్రకటిస్తోంది. బీజేపీ 71 మంది అభ్యర్థుల జాబితాను, హిందుస్థాన్ అవామ్ మోర్చా మొత్తం 6 అభ్యర్థుల జాబితాను మంగళవారంనాడు ప్రకటించాయి. బిహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలుగా నవంబర్ 6,11 తేదీల్లో పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
The post Bihar Assembly Elections: సీఎం నితీశ్ నివాసం వద్ద టికెట్ల పంచాయతీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
