Cell Phone Tenders Scam | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా శిశు సంక్షేమశాఖలో రూ.30 కోట్ల సెల్‌ఫోన్ల టెండర్ల స్కామ్‌ను బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ మరోసారి బట్టబయలు చేశారు. టెండర్ల వెనుక సాగిన అక్రమాలను ఆధారాలతో శుక్రవారం ఎక్స్ వేదికగా బహిర్గతం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం పోషణ్ అభియాన్ కింద అంగన్‌వాడీ టీచర్లకు 38,130 స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు రూ.54.19 కోట్లతో టెండర్లు పిలిచారని తెలిపారు. ఇందులో భాగంగా 4జీ/64 జీబీ మెమరీ కలిగిన శాంసంగ్ ఏ06 మోడల్ ఫోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించారని పేర్కొన్నారు.
కానీ టెండర్ నోటిఫికేషన్‌లో మాత్రం 5జీ ఫోన్లను చూపిం చారని తెలిపారు. అయితే సదరు మోడల్ ఫోన్ విలువ రూ.6000 మాత్రమేనని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం రూ.14,215కు కొనేందుకు టెండర్ ఒప్పందం కుదుర్చుకున్నదని వెల్లడించారు. నిర్వహణ ఖర్చులతో కలుపుకొని రూ.14,499 ధర చెల్లించినట్టు టెండర్‌లో పేర్కొన్నదని తెలిపారు. కానీ వాస్తవానికి బల్క్‌గా కొనుగోలు చేస్తే మొత్తం 38,130 ఫోన్ల విలువ కేవలం రూ.24 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఇదేంటని సంబంధిత శాఖ అధికారులను ప్రశ్నిస్తే మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా పెరిగాయని చెబుతున్నారని అన్నారు. సెల్‌ఫోన్ల కొనుగోలు పేరిట రూ.30 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. మంత్రి సీతక్క అనుయాయులకే టెండర్లు దక్కించుకున్నారని ఆమె పేషీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయన్నారు. స్కామ్‌పై పలుమార్లు ఆధారాలతో అధికారులు స్పందించకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.
