రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ వివిధ పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సోమవారం లండన్ లో భేటీ అయ్యారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి లండన్ వెళ్లినా… రాష్ట్రంలో పెట్టుబడులు, విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించడం కోసం లండన్ లోని దిగ్గజ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం వరుస భేటీలు నిర్వహిచారు. ఈ వరుస సమావేశాల్లో ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. పరిశ్రమలు స్థాపించడంతో పాటు.. జీసీసీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆయా సంస్థల ప్రతినిధులను కోరారు.
రాష్ట్రంలో ఏయే ప్రాంతంలో ఏయే రంగాలను అభివృద్ధి చేస్తున్నామనే విషయాన్ని వివరించడంతోపాటు… రాష్ట్రానికి ఆదాయం సమకూర్చి పెట్టి ఉపాధి కల్పించేలా పరిశ్రమలు స్థాపిస్తే… ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రొత్సహకాలను ముఖ్యమంత్రి వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక పాలసీలను వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అవలంభిస్తున్నామని పారిశ్రామిక వేత్తల దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, ఏవియేషన్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై పారిశ్రామిక వేత్తలతో భేటీల్లో ముఖ్యమంత్రి ప్రస్తావించారు.
అరుదైన ఖనిజాల వెలికితీతకు యూనివర్సిటీల భాగస్వామ్యం
అంతర్గత జలరవాణా మార్గాల ద్వారా అతి తక్కువ వ్యయంతో సరుకు రవాణా చేసేందుకు ఆస్కారం ఉందని ఏపీలో ఈ జల రవాణాకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. లాజిస్టిక్ కారిడార్ ద్వారా ఏపీని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు సీఎం లండన్ లోని పారిశ్రామిక వేత్తలకు వివరించారు. లండన్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు సోమవారం వివిధ పారిశ్రామిక వేత్తలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని… అలాగే ఈ నెల జరగనున్న భాగస్వామ్య సదస్సుకు హజరు కావాలని ముఖ్యమంత్రి ఆహ్వనించారు. ఈ సందర్భంగా ఆయా సంస్థలతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో రోడ్డు, రైలు, వాయు మార్గాలతో పాటు అంతర్గతంగా ఉన్న జలవనరుల్లో జల రవాణా ద్వారా సరకు రవాణాపై పని చేసేందుకు ముందుకు రావాలని లండన్ లోని అరుప్ సంస్థను సీఎం కోరారు.
లండన్ లోని ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ఆరుప్ గ్లోబల్ అఫైర్స్ డైరెక్టర్ జేమ్స్ కెన్నీ, డిజిటల్ రిస్క్ మేనేజ్మెంట్ కంపెనీ అల్తెరిన్ టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రెడీ వూలాండ్, పీజీ పేపర్ కంపెనీ సీఈఓ పూనమ్ గుప్తా, WMG యూనివర్సిటీ నుంచి గౌరవ్ మార్వాహా, మాంఛెస్టర్ యూనివర్సిటీ నుంచి నానోసైన్స్ ప్రొఫెసర్ రాధాబోయా, ఏఐ పాలసీ ల్యాబ్స్ ఫౌండర్ డైరెక్టర్ ఉదయ్ నాగరాజు, ఫ్లుయెంట్ గ్రిడ్ ప్రెసిడెంట్ రత్న గారపాటి, బ్రిటిష్ హెల్త్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రతినిధి పాల్ బెంటన్ తదితరులు హాజరయ్యారు.
ఏపీలోని టెక్నాలజీ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని.. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోందని సీఎం వివరించారు. అమరావతిలోనూ వచ్చే జనవరి నాటికి ఏఐ క్యాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రారంభం కానుందని తెలిపారు. ఏపీలో ఏఐ వినియోగం, నిపుణుల తయారీ వంటి అంశాలతో పాటు ఎకోసిస్టం అభివృద్ధికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే అరుదైన భూగర్భ ఖనిజాల వెలికితీతపై వివిధ యూనివర్సిటీలు కూడా భాగస్వామ్యం వహించాలని తద్వారా వాటిని వెలికితీసి ప్రపంచ అవసరాలకు వినియోగించే అవకాశం ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
The post CM Chandrababu: లండన్ లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
