పెన్షన్ల పంపిణీకు డుమ్మా కొడుతున్న పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బందితో సమావేశం అయిన చంద్రబాబు… పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలకు సంబంధించి ఎమ్మెల్యేల హాజరు వివరాలు ఆరా తీసారు. ఈ సందర్భంగా 48 మంది ఎమ్మెల్యేలు… పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలకు సక్రమంగా హాజరుకావడం లేదని తెలుసుకుని అవాక్కయ్యారు. వెంటనే ఆయా ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని కార్యాలయం సిబ్బందిని ఆదేశించారు.
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి – ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ బ్యాక్ ఆఫీస్ విభాగాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు నిర్వహించే కార్యక్రమాలపై సీఎం చర్చించారు. ప్రజా సమస్యలు, వివిధ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కృషి చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే ప్రజావేదిక కార్యక్రమంలో కూడా పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.
ప్రజాప్రతినిధులు వారంలో ఒక రోజు ఖచ్చితంగా ప్రజావేదిక కార్యక్రమం ద్వారా అర్జీలు స్వీకరించాలని ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయిలో, అక్కడా పరిష్కారం కానివి రాష్ట్రస్థాయిలో పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు తీసుకోవడంతో పాటు తమకు వచ్చిన అర్జీలు పరిష్కారమయ్యే వరకు పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. అదే విధంగా ప్రతి ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ ప్రతి నెల ఒకటో తేదీన ‘పేదల సేవలో పింఛన్ల పంపిణీ’ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
సీఎం చంద్రబాబుతో క్రమశిక్షణ కమిటీ భేటీ
టీడీపీ తిరువూరు నేతల మధ్య నెలకొన్న వివాదంపై రూపొందించిన నివేదికను సీఎం చంద్రబాబుకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ అందచేసింది. ఈ క్రమంలో పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. సీఎంతో కొనకళ్ల నారాయణ, వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ తదితరులు సమావేశమయ్యారు. తిరువూరులో ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్నీ)ల మధ్య నెలకొన్న వివాదాలపై నివేదిక రూపొందించింది క్రమశిక్షణ కమిటీ. ఇటీవల ఇద్దరు నేతల నుంచి వివరణ తీసుకుంది కమిటీ. నేతలు ఇచ్చిన వివరణతో పాటు స్థానిక పరిస్థితులపై నివేదిక రూపొందించి అధినేత చంద్రబాబుకు అందచేసింది క్రమశిక్షణ కమిటీ. ఈ నేపథ్యంలో నివేదికను అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోనున్నారు సీఎం చంద్రబాబు.
The post CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులివ్వాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
