CM Revanth Reddy : ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు పెద్దపీట వేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో రోడ్ షొ నిర్వహించి కార్నర్ మీటింగ్‌లలో ప్రజలనుద్దేశంచి ఆయన ప్రసంగించారు. 2014లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ఐదేళ్లు మహిళా మంత్రి లేదని… తాము అధికారంలోకి రాగానే సీతక్క, కొండా సురేఖలకు మంత్రి పదవులు ఇచ్చామని గుర్తుచేశారు. శిల్పారామం దగ్గర మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం స్టాల్స్ ఇచ్చామన్నారు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే దాన్ని రద్దు చేయాలని మాట్లాడటం బీఆర్‌ఎస్ బద్ధిని తెలియజేస్తోందని విమర్శించారు.
ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలిని ఇంటి నుంచి బయటకు పంపిన కేటీఆర్ (KTR)… జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థి సునీతమ్మను మంచిగా చూసుకుంటాడా అని ప్రశ్నించారు. ఇవన్నీ కేటీఆర్ చెల్లెలే బయటకు వచ్చి చెబుతోందన్నారు. సొంత చెల్లికి అన్నం పెట్టని వారు పిన్నమ్మ కూతురికి బంగారు గాజులు పెడతానంటే ప్రజలు నమ్ముతారా? అని ఎద్దేవా చేశారు.
CM Revanth Reddy – పదేళ్లు పట్టించుకోలేదేం ?
ఉపఎన్నికలో సెంటిమెంట్ రాజేయాలని బీఆర్‌ఎస్ చూస్తోందని.. పదేళ్లు అధికారంలో ఉన్నా, అదే పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా పనిచేసినా జూబ్లీహిల్స్ (Jubilee Hills) నియోజకవర్గంలో సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదో ప్రజలు ఆలోచించాలన్నారు. ఇప్పుడు తాడు బొంగరం లేకుండా అభివృద్ధి చేస్తామని ఓట్లు దండుకోవడానికి ఆ పార్టీ నేతలు ముందుకొస్తున్నారని దుయ్యబట్టారు. మాయమాటలు చెప్పే వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు బీజేపీ ప్రయత్నం
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్‌ఎస్ పనిచేసిందని.. అందుకు ప్రతిగా జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో ప్రతి సందర్భంలో మోదీ సర్కారుకు కేసీఆర్ మద్దతు పలికారని గుర్తుచేశారు. రాష్ట్రానికి నయా పైసా నిధులు తేలేని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొత్తగా సమస్యలు ఉన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి.. దాని పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలోని బోరబండకు వచ్చి సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని సీఎం నిలదీశారు.
ఆశీర్వదిస్తే రూ. వందల కోట్లతో అభివృద్ధి
‘బీఆర్‌ఎస్‌కు పదేళ్లు అవకాశం కల్పించినా అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్‌కు ఈసారి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చేసి చూపిస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. సాధారణ ఎన్నికల్లో అజహరుద్దీన్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తామని మాట ఇచ్చామని.. ఇచ్చిన మాట ప్రకారం ఆయన్ను మంత్రి పదవి ఇచ్చామని తెలిపారు. స్థానికుడైన నవీన్ యాదవ్‌ను ఆశీర్వదిస్తే రూ. వందల కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు. అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత నవీన్ తీసుకుంటాడన్నారు. రోడ్ షో కార్నర్ మీటింగ్‌లలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్‌కు ఎన్ని నిధులిచ్చారో కిషన్‌రెడ్డి చెప్పాలి
కేంద్రమంత్రిగా రెండోసారి పనిచేస్తున్న కిషన్‌రెడ్డి… ఆయన నియోజకవర్గ పరిధిలోని జూబ్లీహిల్స్‌కు ఎన్ని నిధులిచ్చారో లెక్కచెప్పాలి. పోలింగ్‌లోగా నియోజకవర్గానికి ఎన్ని పైసలు తెస్తారో చూద్దాం. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే మీకెందుకు ఇబ్బంది? మైనార్టీల ఓట్లు మీకు రావు. భారత రాష్ట్ర సమితికి ఓట్లు వేయించేందుకే ఇదంతా చేస్తున్నారు. ఉప ఎన్నికలో భాజపా డిపాజిట్ కోల్పోవడం ఖాయం. అంతేకాదు.. 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ చెప్పిన ఆ పార్టీకి ఓట్లు వేయకండి. ఈ ఎన్నికల్లో ఒకవైపు మోదీ, కేసీఆర్.. మరోవైపు రాహుల్, రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అంటూ ఓటర్లకు సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో మంత్రి అజారుద్దీన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : KTR: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ – కేటీఆర్
The post CM Revanth Reddy: ఒక్క అవకాశం ఇవ్వండి – జూబ్లీహిల్స్ రోడ్ షో లో సీఎం రేవంత్‌రెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
