Cough syrup: ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందు 21 మంది చిన్నారులను బలి తీసుకుంది. ఆరోగ్యాన్ని నయం చేయాల్సిన మందు, పిల్లల ప్రాణాలను తీసింది. కోల్డ్రిఫ్ దగ్గు మందు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరణాల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలు ఈ మందును నిషేధించాయి. ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణకు తమిళనాడు ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. గురువారం, నాగ్‌పూర్‌లో సిరప్ తాగి చికిత్స పొందుతున్న పిల్లల్ని ఆయన పరామర్శించారు.
Read Also: Ancient Temple Turkey: ముస్లిం దేశంలో బయట పడిన దేవాలయం.. ఎన్నివేల సంవత్సరాల నాటిది అంటే!
నాగ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం విచారణకు సహకరించడం లేదని అన్నారు. తమిళనాడు ఔషధ నియంత్రణ సంస్థ అక్కడ లభించే ప్రామాణికం కాని ఔషధాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వివరణాత్మక నివేదికను సమర్పించాల్సి ఉందని ఆయన అన్నారు.
అయితే, సీఎం వ్యాఖ్యల్ని తమిళనాడు ప్రభుత్వం కొట్టిపారేసింది. ప్రమాదకర డైథిలిన్ గ్లైకాల్ కనుగొనబడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని నిషేధం జారీ చేసిందని తమిళనాడు ఆరోగ్య మంత్రి మా. సుబ్రమణియన్ అన్నారు. దీనిని మధ్యప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలతో పంచుకున్నామని చెప్పారు. మొదట్లో డ్రగ్‌ను పరిశీలించి ఎలాంటి తప్పు లేదని మధ్యప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలు నివేదించాయని మంత్రి చెప్పారు. గత రెండేళ్లుగా సరైన తనిఖీలు నిర్వహించనందుకు ఇద్దరు సీనియర్ డ్రగ్స్ ఇన్స్‌పెక్టర్లను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని తమిళనాడు మంత్రి అభ్యర్థించారు.
