Couple Friendly | వాలెంటైన్స్ వీక్ సందర్భంగా థియేటర్లలో చిన్న సినిమాల సందడి కొనసాగుతోంది. పెద్ద అంచనాలు లేకుండా విడుదలైన కొన్ని చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి స్పందనను సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి చిన్న సినిమాల్లో తాజాగా యువ హీరో నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ సినిమాపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆసక్తికరమైన పోస్ట్ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. యువ నటుడు సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన కపుల్ ఫ్రెండ్లీ ( Couple Friendly) చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఈ హీరో నటించిన సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. యూత్ ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది.
జీవితంపై పెద్ద ఆశలు లేకుండా సాదాసీదాగా గడిపే ఓ యువకుడి జీవితంలో ఓ అమ్మాయి ప్రవేశించడం, ఇద్దరూ ఒకే ఇంట్లో గడపాల్సి రావడం, ఆ తర్వాత వారి జీవితాల్లో చోటుచేసుకునే పరిణామాలు ఈ సినిమా ప్రధాన కథాంశంగా తెరకెక్కింది. ఈ సినిమాను వీక్షించిన ప్రభాస్ తన సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపించారు. “ఇదొక లవ్లీ అండ్ బ్యూటీఫుల్ ఫిల్మ్. కపుల్ ఫ్రెండ్లీ సినిమాను చాలా ఎంజాయ్ చేశాను. సంతోష్ – మానస వారణాసి జంట అద్భుతంగా కనిపించింది. దర్శకుడు అశ్విన్ ఎంతో ప్రతిభతో సినిమాను తెరకెక్కించాడు. ఇలాంటి కథను వెండితెరపైకి తీసుకొచ్చిన నిర్మాతలకు అభినందనలు. నాకు వర్షం సినిమా ఎంత ప్రత్యేకమో… సంతోష్ శోభన్‌కు కపుల్ ఫ్రెండ్లీ కూడా అంతే ప్రత్యేకంగా నిలుస్తుంది” అని రాసుకొచ్చారు. ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ సినిమా టీంకు భారీ ఉత్సాహాన్నిచ్చాయి.
ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఆదిత్య రవీంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మానస వారణాసి కథానాయికగా నటించింది. ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని విడుదల చేశారు. చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఇప్పుడు ప్రభాస్ ప్రశంసలు కూడా దక్కడం ‘కపుల్ ఫ్రెండ్లీ’కి అదనపు బలంగా మారింది. యూత్‌కు కనెక్ట్ అయ్యే ప్రేమకథ, సహజమైన నటన, మ్యూజిక్ అన్నీ కలగలసి ఈ చిత్రాన్ని థియేటర్లలో మంచి రన్ వైపు తీసుకెళ్తున్నాయి.
