Crime In Guntur: వాళ్లిద్దరూ బావామరదళ్లు… పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు… పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి ఇష్టంలేని అమ్మాయి సోదరుడు పగ పెంచుకున్నాడు. పక్కా పథకం ప్రకారం.. బావ మర్డర్‌కు స్కెచ్ వేశాడు. తన స్నేహితులతో కలిసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. పెళ్లైన రెండు వారాలకే చెల్లెలికి తీరని వేదన కలిగించాడు. బామ్మర్ది.. బావ బతుకు కోరుతాడు అంటారు. బుడంపాడులో బావ చావు కోరుకున్నాడు ఓ బామ్మర్ది. కానీ గుంటూరు రూరల్ మండలం బుడంపాడులో బావ చావు కోరుకున్నాడు ఓ బామ్మర్ది. నడి రోడ్డుపైనే బావను కత్తితో నరికేయడం స్థానికంగా కలకలం రేపింది.
ఇక్కడ శవమై కనిపిస్తున్న ఇతని పేరు గణేష్. ఊరు గుంటూరు రూరల్ మండలం బుడంపాడు. గుంటూరులో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. తెనాలి మండలం కొలకలూరుకు చెందిన అంజలీదేవి… గణేష్‌కు మరదలు అవుతుంది. గణేష్ కుటుంబ సభ్యులు అంజలీదేవితో వివాహం జరిపించాలని భావించారు. అయితే అబ్బాయి.. అమ్మాయి కంటే ఎత్తు తక్కువగా ఉండడంతో వీరి పెళ్లికి అంజలీదేవి సోదరుడు దుర్గారావు ఒప్పుకోలేదు. తర్వాత బావామరదళ్లు గణేష్, అంజలీదేవి కలిశారు. ఇద్దరి మధ్య మెల్లిగా ప్రేమ మొదలయ్యింది. పెద్దల అభ్యంతరాలను పట్టించుకోలేదు. గత నెల 25న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
Cyber Gang Busted: ‘కుబేరా’ తరహా మోసం.. అమాయక అడ్డా కూలీలే వాళ్ల టార్గెట్
వరుసకు మరదలు అయినప్పటికీ ప్రేమ వివాహం కావడంతో .. తమకు పెద్దలనుంచి ప్రాణహాని ఉందని నల్లపాడు పోలీసులను ఆశ్రయించారు. దీంతో నల్లపాడు పోలీసులు ఇరుకుటుంబాల పెద్దలను పిలిపించారు. అంజలీదేవి సోదరుడు, కుటుంబ సభ్యులు మాత్రం ఈ పెళ్లికి అంగీకరించలేదు. అంజలీదేవితో సంబంధం లేదని తేల్చిచెప్పి వెళ్లిపోయారు. తర్వాత అంజలీదేవి సోదరుడు దుర్గారావు గణేష్‌ను బెదిరించడం మొదలుపెట్టాడు. ఇష్టంలేకుండా ఎలా పెళ్లి చేసుకుంటావని మాట్లాడడంతోపాటు చంపుతానని బెదిరించేవాడు. అయితే బంధువులు కోపంలో అలా మాట్లాడుతున్నాడని సర్దిచెప్పారు. బామ్మర్ది దుర్గారావు బెదిరింపులతో నాలుగు రోజులపాటు గణేష్ ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. ఇక ఏం జరగదని భావించి గుంటూరుకు వచ్చిన సమయంలో దుర్గారావు మరో ఇద్దరితో కలిసి వచ్చి గణేష్‌ను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. రక్తపు మడుగులో పెనుగులాడిన గణేష్.. అక్కడికక్కడే మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న పాతగుంటూరు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తన సోదరుడు దుర్గారావుకు మొదటి నుంచి పెళ్లి ఇష్టంలేదని అంజలీదేవి ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకున్న తర్వాత మీకు… మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాడంటుంది. ఇలా నమ్మించి హత్య చేస్తాడని అనుకోలేదని కన్నీరుమున్నీరవుతోంది. తనకు న్యాయం చేయాలని కోరింది.
Ganja Smuggling: పెద్ద ప్లానింగే.. లగేజీ బ్యాగుల మాటున భారీ ఎత్తున గంజాయి స్మగ్లింగ్
గణేష్ హత్యతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. పెళ్లై రెండు వారాలు కాకముందే అన్యాయంగా చంపేశారని గణేష్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తాము మొదటి నుంచి ఆ కుటుంబంతో సంబంధం వద్దని చెబుతున్నా గణేష్ వినలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంజలీదేవి సోదరుడు దుర్గారావు మంచి వాడు కాదని చెప్పినా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంటున్నారు. పెళ్లి తర్వాత కూడా అమ్మాయిని వాళ్ల ఇంటికి పంపించమన్నా అంజలీదేవి మాత్రం తాను ఇక్కడే ఉంటానని చెప్పిందన్నారు. ఇప్పుడు చెల్లెలి మొగుడు అని కూడా చూడకుండా బావను హత్య చేశారని మండిపడుతున్నారు.
గణేష్ హత్య విషయం తెలుసుకున్న పాత గుంటూరు పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. గణేష్ కుటుంబ సబ్యులతో మాట్లాడి హత్యకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. అంజలీదేవి సోదరుడు దుర్గారావు మరో ఇద్దరు కలిసి హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. దుర్గారావుకు నేరచరిత్ర కూడా ఉందంటున్నారు పోలీసులు. దుర్గారావుపై పోక్సో కేసు నమోదయ్యిందన్నారు. తెనాలి పోలీస్ స్టేషన్ లో దుర్గారావుపై సస్పెక్ట్ షీట్ కూడా ఉందన్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో తోడబుట్టిన చెల్లెలి కాపురంలో చిచ్చుపెట్టిన కసాయి సోదరుడి కోసం పోలీసులు గాలింపులు మొదలుపెట్టారు.
