బెట్టింగ్ యాప్స్ ఉసురు తీస్తున్నాయి. వీటి మాయలో పడ్డ యువత.. నిండా మునిగి.. అప్పులపాలై ఎవరికి వారే ఉసురు తీసుకుంటున్నారు. మరికొందరు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. చివరికి సొంత వాళ్లను కూడా చంపేందుకు వెనకాడడం లేదు. అలాంటి ఘటనే యూపీలో జరిగింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసగా మారిన కొడుకు.. డబ్బు కోసం కన్నతల్లినే కడతేర్చాడు. మరో వ్యక్తి ఓయో రూమ్‌లో సూసైడ్ చేసుకున్నాడు.
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న యువతీ యువకులు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు అడిక్ట్ అవుతున్నారు. వాటిలో బెట్టింగ్ పేరుతో వేలు, లక్షల్లో డబ్బలు పెట్టి నిండా మునిగిపోతున్నారు. చివరికి ఏ ఆప్షన్ లేక.. కొంత మంది అప్పులు తీర్చే మార్గం లేక బలవన్మరణం చెందుతున్నారు. మరోవైపు కొంత మంది మాత్రం డబ్బు కోసం అయిన వాళ్లను వేధిస్తున్నారు. కాదంటే కడతేర్చుతున్నారు. ఇలాంటి ఘటనే యూపీలో జరిగింది.
ఆన్‌లైన్ గేమింగ్‌కు వ్యవసనపరుడైన 20 ఏళ్ల యువకుడు జన్మనిచ్చిన తల్లిని చంపేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఈ నెల 3న జరిగింది. మూడు రోజుల తర్వాత దర్యాప్తు చేసిన ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సొంత కుమారుడే తల్లిని హత్య చేశాడని తేల్చారు. అయితే ఈ హత్యకు బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్‌లకు బానిసైన యువకుడు ఏకంగా ఏడాది కాలంలో దాదాపు 50 లక్షల రూపాయలు పొగొట్టుకున్నాడు. ఈ నగదును పలు లోన్ యాప్‌లతో పాటు ఇతరుల వద్ద అప్పులు చేసి మరీ ఆడాడని పోలీసు విచారణలో తేలింది. లోన్ యాప్ వేధింపులతో భయాందోళనకు గురైన యువకుడు.. ఇటీవల ఇంట్లో బంగారం ఆభరణాలను చోరీ చేశాడు. ఆ సమయంలో దొంగతనాన్ని తన తల్లి చూసిందని.. విషయాన్ని తండ్రికి చెప్పితే పరిస్థితి దారుణంగా ఉంటుందనే అనుమానంతో తల్లిని చంపేశాడు.
Also Read: Diwali 2025 Date: అక్టోబర్ 20 లేదా 21.. దీపావళి పండగను ఎప్పుడు జరుపుకోవాలి!
ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఇంట్లోకి దొంగలు వచ్చారని, అమ్మను చంపేశారని డ్రామా ఆడాడు. తనను కూడా చంపేస్తారని దాక్కున్నానని నటించాడు. దొంగలు ఇంట్లో ఉన్న బంగారం , నదును ఎత్తుకెళ్లారని అందరీని డైవర్ట్ చేశాడు. కానీ ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు.. అతని తల్లి మృతిపై దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో యువకుడిని అరెస్టు చేశారు. అయితే ఈ సంఘటన హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.
మరోవైపు బెట్టింగ్ యాప్‌లతోపాటు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి తీవ్ర నష్టాల్ని చవిచూసిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఓయో రూమ్ అద్దెకు తీసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జై జవాన్ కాలనీకి చెందిన మన్నె నరేందర్ తండ్రి చనిపోగా.. తల్లి జగదాంబతో కలిసి జీవిస్తున్నాడు. నరేందర్ గతంలో ఓ షాపింగ్‌మాల్‌లో సేల్స్‌మెన్‌గా పని చేశాడు. స్టాక్మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. షేర్ మార్కెట్ పరుగులు తీసినంతకాలం లాభాలు ఆర్జించాడు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. మరోవైపు బెట్టింగ్ యాప్స్‌లో కూడా పెట్టుబడి పెట్టాడు. లాభాలు ఎక్కువగా వస్తాయని నమ్మాడు. కానీ తీవ్ర నష్టాలు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఈసీఎల్ కమలానగర్ లోని ఆర్ స్క్వేర్ ఓయో రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
