Cyclone Montha | చారిత్రక ఓరుగల్లుపై మొంథా తుఫాను (Cyclone Montha) విరుచుకుపడింది. బుధవారం రోజంతా కుండపోతగా వర్షం కురియడంతో వరంగల్ నగరం జలదిగ్బంధం అయింది. వర్షం కాస్తా తెరపినిచ్చినప్పటికీ నగరాన్ని ఇంకా వరద వీడలేదు. వర్షపు నీరు పలు కాలనీలను ముంచెత్తింది. మొత్తం 45 కాలనీలను వరద నీరు ముంచెత్తింది. నగరం పరిధిలోని 30 కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి. సాయిగణేశ్ కాలనీ, సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్యనగర్, సమ్మయ్య నగర్లో వర్షపు నీరు ఇండ్లలోకి చేరింది. దీంతో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వరంగల్ తూర్పులో అధికారులు ఆరు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల వారిని పడవల సహాయంతో పునరావాస శిబిరాలకు తరలించారు. నగరంలోని 12 పునరావాస కేంద్రాలకు 1200 మంది బాధితులను తరలించారు. హనుమకొండలో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తున్నది. వర్షపు నీటితో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.
హంటర్‌రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో వరంగల్, హనుమకొండ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ములుగు వెళ్లే రోడ్డులో నాలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నారు. వర్షాల దృష్ట్యా వరంగల్ బల్దియా కార్యాలయంలో టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 1980 ఏర్పాటు చేశారు. డీఆర్ఎఫ్, ఇంజినీరింగ్, శానిటరీ సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను నియమించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. పాఠశాలల్లో ఎస్ఏ-1 పరీక్షలు కూడా వాయిదా వేసినట్లు వరంగల్ డీఈవో వెల్లడించారు.
