Cyclone Montha : మొంథా తుఫాన్ వరంగల్ జిల్లాను ముంచేసింది. మొన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్థంభించిపోయింది. లోతట్టు ముంపు ప్రాంతాలు మొత్తం నీటిలో మునిగాయి. శాఖ రాసి కుంట, శివనగర్, బి ఆర్ నగర్, ఎస్సార్ నగర్, ఎన్టీఆర్ నగర్, కిల్లా వరంగల్ ప్రాంతాలలో ఇళ్లల్లోకి వరద నీళ్లు వచ్చాయి. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో వాళ్లను పునరావాస కేంద్రాలకు తరలించారు. అర్ధరాత్రి దాకా భారీ వర్షాలు కురిసేసరికి చాలా కాలనీలు చెరువుల్లా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల స్తంభాలు విరిగిపోయాయి. వైర్లు తెగిపోయాయి. చెట్లు నేలకూలాయి.
Read Also : Prabhas : క్రేజీ యాక్టర్ ను గుర్తు పట్టలేకపోయిన ప్రభాస్..
అర్ధరాత్రి వరకు వర్షం ఆగిపోయినా జరగాల్సిన నష్టం భారీగానే జరిగింది. ఎటు చూసినా రోడ్ల మీద వర్షం నీళ్లే కనిపిస్తున్నాయి. నాలాలు ఉప్పొంగుతున్నాయి. ప్రజలంతా వరద నీటితో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. నీటిని మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ కలెక్టర్ తో ప్రత్యేక కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన వాటి గురించి కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా పంట నష్టం కూడా భారీగానే జరిగింది. ఐకేపీ కేంద్రాల్లోని వడ్లు మొత్తం నానడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటిపై కూడా కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.
Read Also : CM Revanth Reddy : మొంథాపై కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ..
