Cyclone Montha: తుఫాన్ ఎఫెక్ట్‌తో ఒక్కసారిగా ఏపీలో వాతావరణం మారిపోయింది. విశాఖ, కోస్తా జిల్లాల్లో తీరం వెంట వర్షం కురుస్తోంది. 24 గంటల్లో అతి భారీవర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం వణికిస్తోంది.తుఫాన్ తీరం దాటే సమయంలో 105 కిలోమీటర్ల వేగంతో తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు అధికారులు. అన్ని జిల్లాల కలెక్టరేట్‌లలోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. బుధవారం వరకూ ఏపీకి తుఫాన్ ముప్పు కొనసాగుతుందన్నారు. మొంథా తుఫాన్ ఏపీలోని 10 జిల్లాలపై ప్రభావం చూపిస్తోంది. విశాఖ, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై తుఫాన్ ఇంపాక్ట్ ఉంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లోని అధికారులను అలర్ట్ చేసింది ప్రభుత్వం. కంట్రోల్ రూమ్‌లు సిద్ధం చేసింది. మరీముఖ్యంగా.. కాకినాడ జిల్లాపై తుఫాన్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది.
కాకినాడ సిటీతో పాటు రూరల్ మండలాల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాకినాడ సమీపంలోనే తుఫాన్ తీరం దాటుతుండటంతో…ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది IMD. ముఖ్యంగా ఉప్పాడ బీచ్, సమీప తీరప్రాంతాల్లో అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడి, బీచ్ కోతకు గురయ్యే ఛాన్స్ ఉంది. కాకినాడ సిటీలోనే 105 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇటు పెద్దాపురం, పిఠాపురం, తుని, సామర్లకోటలో జోరు వర్షాలు పడుతున్నాయ్. మరోవైపు..తుఫాన్‌తో కాకినాడ రూరల్ మండలాలు చిగురుటాకులా వణికిపోతున్నాయ్. గాలివానకు వరి, అరటితో పాటు వాణిజ్య పంటలు దెబ్బతింటాయని టెన్షన్ పడుతున్నారు రైతులు.
మొంథా తుఫాన్ కారణంగా ఇవాళ విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. 16 సెం.మీలకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. తీవ్రత ఎక్కువగా ఉంటే దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ షాపులు, కూరగాయలు, పాలు విక్రయ దుకాణాలు తెరచుకోవచ్చని తెలిపారు.మరోవైపు..ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్, వీఎంసీ ప్రధాన కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.నదీపరీవాహక ప్రాంతంతోపాటు ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వీఎంసీ పరిధిలోని 64 డివిజన్లలో 34 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడికి తరలివచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలుతీసుకుంటున్నారు.
నెల్లూరు జిల్లా 9 మండలాల్లోని 42 గ్రామాల్లో హైఅలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. పశ్చిమ గోదావరి జిల్లాలో 16 తుఫాన్ షెల్టర్స్ ఏర్పాటు చేసింది. భీమవరం, తాడేపల్లిగూడెంలో పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. కాకినాడ, ఉప్పాడ, యానాం-ఎదురులంక సహా.. గోదావరి లంక గ్రామాల్లో ఈదురు గాలులతో అల్లకల్లోలంగా మారాయి. మచిలీపట్నం తీరప్రాంతాలకు NDRF టీమ్‌లు చేరుకున్నాయి. ఇప్పటికే తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో 3 రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మరోవైపు గడిచిన 6 గంటల్లో గంటకు 18 కి.మీ వేగంతో మొంథా తుపాన్ కదులుతోందని అన్నారు. పశ్చిమ తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండకండి..అప్రమత్తంగా ఉండని వాతావరణ శాఖ పేర్కొంది.
అలాగే తీర ప్రాంత జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని తెలిపింది. ఇక, ఇవాళ.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను తక్షణమే సమీపంలోని తుఫాన్ రక్షణ కేంద్రాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు.
