ఏపీ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న ‘మొంథా’ తుఫాన్ బలహీనపడింది. తీవ్ర తుఫాన్.. తుఫాన్‌గా బలహీనపడింది. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ మచిలీపట్నంకు 50 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయింది. తుఫాన్ ప్రభావంతో నేడు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రలో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Also Read: Daily Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు జాగ్రత్త సుమీ!
ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
