జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ వీడింది. లంకల దీపక్ రెడ్డిని తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఊహించిన విధంగా దీపక్ రెడ్డి వైపే… బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. తాజాగా బుధవారం దీపక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. ఇక, దీపక్ రెడ్డి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దీపక్‌రెడ్డికి 25వేల ఓట్లు వచ్చాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పక్కా ప్రణాళికలు చేస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలోనూ పార్టీలు ఆచితూచి అడుగులు వేశాయి. ఇక, ఈ ఎన్నికలో అధికార కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ తరఫున మాగంటి సునీత గోపీనాథ్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో త్రిముఖ పోరు ఉండనుంది.
బీజేపీ ఆఫీసులో ఉద్రిక్తత
తెలంగాణ రాజకీయాల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర బీజేపీ ఆఫీస్‍లో బీసీ నేతల మధ్య కొట్లాట తీవ్ర కలకలం రేపింది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య… ఎదుటే నేతలు ఇలా తన్నుకోవడం విశేషం. దీంతో, ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఈనెల 18న బీసీ జేఏసీ నిర్వహించ తలపెట్టిన బంద్‍కు మద్దతు ఇవ్వాలని బీజేపీని కోరేందుకు ఇవాళ ఆర్.కృష్ణయ్యతో పాటు బీసీ సంఘాల నేతలు బీజేపీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టే సమయంలో జూనియర్ అయి ఉండి ఫొటోలకు ఎలా ముందుకు వెళ్తావ్ అని ఒకరినొకరు తిట్టుకున్నారు. దీంతో, రెండు వర్గాల నేతలు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. అనంతరం, ఒక్కసారిగా బీజేపీ ఆఫీసులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘర్షణకు దిగిన నేతలను మిగతా బీసీ నాయకులు అడ్డుకున్నారు. కొట్లాటకు దిగిన నేతలపై మిగతా బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
The post Deepak Reddy: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
