Degree Student : విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో దారుణం జరిగింది. కళాశాలలో మహిళా అధ్యాపకుల వేధింపులు తాళలేక… డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాలలో ఇద్దరు మహిళా అధ్యాపకులు… తమ లైంగిక అవసరాలు తీర్చాలంటూ ఒత్తిడి చేయడంతోనే తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ… మృతుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఫిర్యాదుతో పాటు మృతునితో ఆ మహిళా అధ్యాపకులు జరిపిన వాట్పాప్ ఛాటింగ్ కూడా జతపరచినట్లు సమాచారం. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Degree Student Suicide
విశాఖపట్నం (Visakhapatnam) నగరంలోని ఎంవీపీ కాలనీ (MVP Colony) నాలుగో సెక్టార్‌లో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ కోన సూరిబాబు పెద్ద కుమారుడు సాయితేజ (22)… అదే ప్రాంతంలోని సమతా డిగ్రీ కళాశాలలో (Degree Student) మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే కాలేజీలో స్టాటిస్టిక్స్ అధ్యాపకురాలు తనను నిత్యం వేధిస్తున్నారని, పరీక్షల్లో జవాబులు బాగా రాసినా మార్కులు వేయడం లేదని, రికార్డులు అధికంగా రాయిస్తున్నారని విద్యార్థి తన తల్లిదండ్రులకు చెప్పాడు. అధ్యాపకుల వేధింపులపై యాజమాన్యంతో మాట్లాడేందుకు సాయితేజ తల్లిదండ్రులు, మామయ్య శుక్రవారం ఉదయం కాలేజీకి వెళ్లారు. అక్కడ ఉండగానే వారు ఇంట్లో ఉన్న సాయితేజతో రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు స్పందించలేదు. దీనితో ఇంటికి వెళ్లి చూసేసరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతిచెంది ఉన్నాడు. దీంతో సహచర విద్యార్ధులతో కలిసి కుటుంబసభ్యులు కాలేజీ ఎదుట ఆందోళణకు దిగారు. అనంరతం ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుటుంబసభ్యులు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఓ అధ్యాపకురాలి లైంగిక వేధింపుల అంశాన్ని ప్రస్తావించారు. దానికి విద్యార్థితో ఇద్దరు మహిళా అధ్యాపకుల వాట్సాప్ చాటింగ్‌లను జత చేసినట్లు సమాచారం. స్టాటిస్టిక్స్ అధ్యాపకురాలు, క్లాస్ టీచర్ కలసి తనను వేధిస్తున్నట్టు సాయితేజ పలుసార్లు తమకు చెప్పాడని పేర్కొన్నారు. క్లాస్ టీచర్, స్టాటిస్టిక్స్ అధ్యాపకురాలు మంచి మిత్రులని… క్లాస్ టీచర్ లైంగిక అవసరాల కోసమే సాయితేజపై స్టాటిస్టిక్స్ అధ్యాపకురాలు ఒత్తిడి తెచ్చే వారని ఆరోపించారు. పరీక్షల్లో బాగా రాసినా మార్కులు వేయకుండా, రికార్డులపై ఉద్దేశపూర్వకంగా సంతకం పెట్టకుండా వేధించేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతుడు సాయితేజ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు క్లాస్ టీచర్ వాట్సాప్ మెసేజ్‌లపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటన దురదృష్టకరమని, విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కళాశాల యాజమాన్యం పేర్కొంది. కాగా, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని ఏబీవీపీ విద్యార్థి సంఘం, కమ్యూనిస్టు నాయకులు కళాశాల ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. నిష్పాక్షిక విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వారికి హామీ ఇచ్చి పంపించారు.
విశాఖ సమతా కళాశాల వద్ద ఉద్రిక్తత
కళాశాల అధ్యాపకురాలి వేధింపులు కారణంగానే సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. న్యాయం జరిగే వరకు కళాశాల ప్రాంగణం నుంచి కదిలేది లేదని తోటి విద్యార్థులు నిరసన చేపట్టారు. పోలీసులు వారించే ప్రయత్నం చేస్తున్నా పట్టించుకోకుండా గేట్లు తోసుకుంటూ సాయితేజ కుటుంబ సభ్యులు, విద్యార్థులు ముందుకెళ్లడంతో.. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పే వరకు కళాశాల వద్ద నుంచి కదిలేది లేదని రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
Also Read : Kashibugga Stampade: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిలాట ! 9 మంది మృతి !
The post Degree Student: మహిళా అధ్యాపకుల వేధింపులు తాళలే డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
