దేశ రాజధాని దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియాకు చెందిన ఓ బస్సు దగ్ధమైంది. ఎయిర్‌పోర్టులోని (Delhi Airport) మూడో టర్మినల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్యాక్సీయింగ్ ఏరియాలో నిలిపి ఉంచిన విమానానికి అత్యంత సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఆ సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌క్రాఫ్ట్ రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాక సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. ట్యాక్సీయింగ్ ఏరియాలో నిలిపి ఉంచిన విమానానికి అత్యంత సమీపంలో ఈ ఘటన జరిగినప్పటికీ ఆ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు సమీపంలో ఉన్న విమానం దెబ్బతినలేదని, అందులోని ప్రయాణికులంతా సురక్షితమేనని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
SATS ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ అనే థర్డ్ పార్టీ ప్రొవైడర్ ఎయిరిండియాకు ఈ బస్సు సర్వీసులను అందిస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే బస్సుకు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై ఎయిర్‌పోర్టు అధికారులు దర్యాప్తు చేపట్టారు. గ్రౌండ్ హ్యాండిలర్స్‌కు చెందిన బస్సు మధ్యాహ్నం సమయంలో మంటల్లో చిక్కుకుందని, అయితే ఏఆర్‌ఎఫ్ఎఫ్ నిపుణుల బృందం రెండు నిమిషాల్లోనే మంటలను అదుపు చేసిందని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో తెలియజేసింది. ఘటన సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ నష్టం జరగలేదని తెలిపింది. విమాన సర్వీసులు యథాప్రకారం నడుస్తున్నాయని తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొంది.
భారత్ లో విమానాల తయారీకు హెచ్‌ఏఎల్‌తో రష్యా సంస్థ ఒప్పందం
విమానాల విడిభాగాలు, హెలికాప్టర్ల తయారీలో ఎంతో పురోగతి సాధిస్తోన్న భారత్… పూర్తి స్థాయి ప్రయాణికుల విమానాల ఉత్పత్తి వైపు అడుగులు వేస్తోంది. దేశంలో ఎస్‌జే-100 జెట్‌లను తయారు చేసేందుకు రష్యా యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ (UAC) సిద్ధమైంది. ఈ మేరుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (HAL)తో యూఏసీ ఒప్పందం చేసుకుంది.
‘‘భారత్‌లో పూర్తి ప్రయాణికుల విమానం తయారు చేయనుండడం ఇదే తొలిసారి. గతంలో ఏవీఆర్‌ఓ హెచ్‌ఎస్-748 విమానాలను 1961లో తయారు చేయగా.. 1988లో ఆ ప్రాజెక్టు ముగిసింది. రానున్న పదేళ్లలో స్థానిక కనెక్టివిటీ కోసం ఎస్‌జే-100 వంటి చిన్న పరిమాణం కలిగిన 200 విమానాలు అవసరం. పౌర విమానయాన రంగంలో భారత్ ఆత్మనిర్భరత సాధించేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారుతుంది’’ అని హెచ్‌ఏఎల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలో ఉడాన్ పథకం కింద స్వల్ప దూర ప్రయాణాలకు గేమ్ ఛేంజర్‌గా మారనుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఎస్‌జే-100 రెండు ఇంజిన్లతో కూడిన చిన్న పరిమాణం కలిగిన విమానం. 103 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉన్న ఈ విమానం.. స్వల్ప దూరం ప్యాసింజర్ సేవలకు అనువుగా ఉంటుంది. నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. తాజా ఒప్పందంతో దేశీయ అవసరాలకు అనుగుణంగా ప్రయాణికుల విమానం తయారు చేసేందుకు హెచ్‌ఏఎల్‌కు వీలు ఉంటుంది. ఇప్పటికే రష్యా సంస్థ 200 విమానాలను తయారు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా 16 ఎయిర్‌లైన్ సంస్థలు వీటిని నడిపిస్తున్నట్లు తెలిసింది.
క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ పూర్తిచేసుకుని కృత్రిమ వర్షానికి దిల్లీ రెడీ
దేశ రాజధాని దిల్లీని తీవ్ర వాయు కాలుష్యం వేధిస్తోంది. దీపావళి అనంతరం పరిస్థితులు మరింత దిగజారాయి. మంగళవారం దిల్లీలో వాయు నాణ్యత సూచీ (AQI) 306గా నమోదు అయినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) వెల్లడించింది. ఇది తీవ్రమైన కాలుష్య కేటగిరిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు స్థానికంగా కృత్రిమ వర్షం కురిపించేందుకు దిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘క్లౌడ్ సీడింగ్’ ప్రక్రియను పూర్తి చేసింది. ఐఐటీ కాన్పూర్ నుంచి బయల్దేరిన ఎయిర్ క్రాఫ్ట్ సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ లాంటి రసాయన ఉత్ప్రేరకాలను వివిధ ప్రాంతాల్లోని మేఘాలపై చల్లి క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో మరికొన్ని గంటల్లో వర్షం పడే అవకాశం ఉంది.
నగరంలో ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించడానికి దిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 25న ఐఐటీ కాన్పూర్‌తో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం.. అక్టోబర్ 1 నవంబర్ 30 మధ్య ఎప్పుడైనా ట్రయల్స్ నిర్వహించడానికి పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (DGCA) అనుమతిచ్చింది. ఈ ప్రక్రియను నిర్వహించడానికి కావాల్సిన రూ.3.21 కోట్ల బడ్జెట్‌ను దిల్లీ మంత్రివర్గం మేలో ఆమోదించింది. అయితే, ప్రతికూల వాతావరణం, రుతుపవన పరిస్థితుల కారణంగా ఈ ప్రక్రియ పలుమార్లు వాయిదా పడింది.
కృత్రిమ వర్షాలు ఎలా కురిపిస్తారు?
తొలుత శాస్త్రవేత్తలు కృత్రిమ వర్షానికి అనువైన మేఘాలను గుర్తిస్తారు. వాటిలో సరిపడా తేమ ఉంటుంది. కానీ, వర్షించేందుకు అనువైన పరిస్థితులు ఉండవు. అలాంటి సందర్భంలో.. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ లాంటి రసాయన ఉత్ప్రేరకాలను మేఘాలపై చల్లి.. క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఇవి మేఘాల్లోని తేమను కరిగించి.. వర్షపు బిందువుల రూపంలో కింద పడేందుకు సహకరిస్తాయి. కొన్ని సార్లు పొడి మంచును కూడా వినియోగిస్తారు. దీనివల్ల మేఘాలు చల్లబడి వర్షం కురిసేందుకు వీలుంటుంది.
The post Delhi Airport: దిల్లీ ఎయిర్‌పోర్టులో బస్సు దగ్ధం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
