Dhurandhar 2 | మోస్ట్ అవేటెడ్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ విడుదలైన మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం బుధవారం సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలతో తన దూకుడు మొదలుపెట్టింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ప్రీమియర్ షోల ద్వారానే ఈ సినిమా ఇండియాలో సుమారు రూ.43 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. దీంతో ప్రీమియర్ షోల ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా ఇది కొత్త రికార్డు నెలకొల్పింది.గురువారం (మార్చి 19) అధికారికంగా విడుదలైన ఈ చిత్రం, మొదటి రోజే దేశవ్యాప్తంగా థియేటర్ల వద్ద భారీగా ప్రేక్షకులను ఆకర్షించింది. ఫస్ట్ డే ముగిసే సరికి ‘ధురంధర్ 2’ ఇండియాలోనే సుమారు రూ.146 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఫస్ట్ డేలోనే రూ.100 కోట్ల మార్క్ దాటిన తొలి హిందీ సినిమాగా ఇది చరిత్ర సృష్టించింది. ఇందులో హిందీ వెర్షన్ నుంచే రూ.103 కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం.
ఈ రికార్డులతో ‘జవాన్’, ‘పఠాన్’, ‘యానిమల్’ వంటి బిగ్గెస్ట్ ఓపెనర్స్‌ను ఈ సినిమా దాటేసింది. అలాగే ఆల్ ఇండియా స్థాయిలో ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ చిత్రాల ఫస్ట్ డే రికార్డులను కూడా అధిగమించింది. అన్ని భాషల్లో కలిపి చూస్తే ‘పుష్ప 2’ తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది.హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రం దుమ్ము రేపుతోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ రూ.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, తమిళంలో కూడా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అన్ని ప్రాంతాల్లో రెగ్యులర్ షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి.
దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ స్పై డ్రామాలో రణ్‌వీర్ సింగ్ ఎనర్జీ, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ నటుల నటన సినిమాకు మరింత బలం చేకూర్చింది. మొదటి భాగం భారీగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో, ‘ధురంధర్ 2’ కూడా అదే స్థాయిని దాటి మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మరికొన్ని రోజులు సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
