Dhurandhar 2 | బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా, డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ డబ్బింగ్ వెర్షన్స్‌కు చివరికి గ్రీన్ సిగ్నల్ లభించింది. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో విడుదల కావాల్సిన ఈ సినిమా, కొంత ఆలస్యం తర్వాత ఇప్పుడు థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. మొదటిగా ఈ డబ్బింగ్ వెర్షన్స్ మార్చి 18న ప్రీమియర్స్, మార్చి 19న హిందీ వెర్షన్‌తో పాటు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కంటెంట్ డెలివరీలో జాప్యం, టెక్నికల్ సమస్యల కారణంగా షోలు రద్దయ్యాయి. దీంతో అభిమానులు నిరాశ చెందగా, థియేటర్లు టిక్కెట్లు బుక్ చేసిన వారికి రీఫండ్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక తాజాగా CBFC తమిళం, తెలుగు, మలయాళం వెర్షన్స్‌కు సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ మూడు వెర్షన్స్ మార్చి 19న సర్టిఫై అయ్యాయి. అయితే కన్నడ వెర్షన్ సర్టిఫికేషన్ మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉంది.
సెన్సార్ వివరాల ప్రకారం ఈ సినిమా రన్‌టైమ్ సుమారు 3 గంటలు 51 నిమిషాలు. హిందీ వెర్షన్ రన్‌టైమ్ 3 గంటలు 49 నిమిషాలు ఉండగా, డబ్బింగ్ వెర్షన్స్ కొద్దిగా ఎక్కువగా ఉండటం విశేషం. హిందీ వెర్షన్‌కు ముందుగా ‘A’ సర్టిఫికెట్ ఇచ్చి, తర్వాత రీమాడిఫికేషన్ చేసినట్టే, ఇప్పుడు డబ్బింగ్ వెర్షన్స్‌కు కూడా అదే సర్టిఫికేషన్ వర్తించింది. ఇక టికెట్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. బుక్ మై షో సహా పలు టికెటింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో షోలు అందుబాటులోకి వచ్చాయి. మార్చి 21 మధ్యాహ్నం నుంచి ఈ డబ్బింగ్ వెర్షన్స్ థియేటర్లలో ప్రదర్శించబడనుంది .ఏలూరులోని SVC Cinemas సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. “ఈసారి టికెట్ బుక్ చేసిన తర్వాత క్యాన్సిల్, రీఫండ్ అడగకుండా సినిమా చూడండి” అంటూ మేకర్స్‌కు సెటైరికల్‌గా కౌంటర్ ఇచ్చారు. ఈ పోస్ట్ అభిమానుల్లో చర్చకు దారి తీసింది.
సినిమా కథ పరంగా చూస్తే, రెహమాన్ డకాయిట్ మరణం తర్వాత ఇండియన్ ఏజెంట్ జస్కిరత్ సింగ్ రంగీ (హమ్జా అలీ మజారీ) పాకిస్తాన్‌లోని టెర్రర్-పాలిటికల్ నెట్‌వర్క్‌లో కీలక స్థానానికి ఎదిగి, దేశ శత్రువులపై ప్రతీకారం తీర్చుకునే కథాంశంతో తెరకెక్కింది. కాగా, ‘ధురంధర్’ మొదటి భాగం కేవలం హిందీలోనే విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు సీక్వెల్ ‘ధురంధర్ 2’ మొదటి రోజే సుమారు రూ.240 కోట్ల భారీ ఓపెనింగ్ సాధించింది. ఇక డబ్బింగ్ వెర్షన్స్ కూడా జాయిన్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశముంది.
