‘దీపావళి’ పండుగ హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ దీపాల పండుగ కోసం దేశంలోని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి దీపావళి పండగ తేదీ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. కొంతమంది జ్యోతిష్కులు దీపావళి పండగను అక్టోబర్ 20న వస్తుందని చెబుతుండగా.. మరికొందరు అక్టోబర్ 21న జరుపుకుంటారని అంటున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి పండగను ఏ రోజున జరుపుకోవాలో మనం తెలుసుకుందాం.
దేశంలోని ప్రముఖ పండితుల సంస్థ ‘కాశీ విద్వత్ పరిషత్’ ఈ సంవత్సరం దీపావళిని అక్టోబర్ 20న జరుపుకోవాలని స్పష్టం చేసింది. దీపావళి పండగ తేదీల గందరగోళం నేపథ్యంలో తాజాగా కౌన్సిల్ ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంలో దీపావళి తేదీపై సుదీర్ఘంగా చర్చించారు. మతపరమైన సూత్రాలు, లేఖనాత్మక లెక్కల ఆధారంగా పూర్తి ప్రదోష కాలం అక్టోబర్ 20న మాత్రమే ఉంటుందని తేల్చారు. అక్టోబర్ 21న అమావాస్య మూడున్నర గంటలకు పైగా ఉండటంతో నక్త ఉపవాసం (లక్ష్మీ ఆరాధనలో ముఖ్యమైన భాగం) విచ్ఛిన్నం చేయడానికి ఆ రోజు సమయం ఉండదు. అందువల్ల అక్టోబర్ 20న దీపావళిని జరుపుకోవాలని కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయించింది.
Also Read: Rohit Sharma: సీక్రెట్‌గా కానిచ్చేస్తున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్!
కాశీ విద్వత్ పరిషత్ సమావేశం అక్టోబర్ 4న కౌన్సిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ రామచంద్ర పాండే అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కాశీ విద్వత్ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి అండ్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రామనారాయణ ద్వివేది హాజరయ్యారు. ద్రిక్ పంచాంగ్ ప్రకారం… ఈ సంవత్సరం అమావాస్య తిథి అక్టోబర్ 20న మధ్యాహ్నం 3:44 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 21న రాత్రి 9:03 గంటలకు ముగుస్తుంది. దీపావళి నాడు లక్ష్మీ, గణేశులను పూజించడానికి అత్యంత పవిత్రమైన సమయం సాయంత్రం 7:08 నుంచి 8:18 వరకు ఉంటుంది. ప్రదోష కాలం, స్థిరమైన లగ్నంతో సమానంగా ఉండే ఈ సమయం లక్ష్మీదేవి అండ్ గణేశుడి ఆశీస్సులు పొందడానికి అనువైనదిగా పరిగణించబడుతుంది.
