వాషింగ్టన్ : ఇరాన్ యుద్ధం( Iran war) మొదలై ఐదు వారాలైనప్పటికీ ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం.. యుద్ధం ఖర్చులు తడిసి మోపెడు కావడంతో పాటు అమెరికన్ పౌరులు సైతం తనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించడం వంటి పరిణామాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇరాన్ యుద్ధంపై ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక సతమతమవుతున్నారు. ఈ క్రమంలో డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్‌లో జాతినుద్దేశించి మాట్లాడారు. ఇరాన్ ముఖ్య నేతలను అంతమొందించాం. మరో మూడు రోజుల్లో యుద్ధం ముగుస్తుందని చెప్పారు.
హర్మూజ్ జల సంధి నుంచి తమకు ఎలాంటి చమురు అక్కర్లేదని స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధిని ఇరాన్ కోసం మాత్రమే వినియోగించుకోవాలి అని సూచించారు. సంక్షోభం ముగిశాక హర్మూజ్ జల సంధి తెరుచుకుంటుందని పేర్కొన్నారు. ఇరాన్‌ను ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధ దేశంగా మారనివ్వమని తెలిపారు. ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. ఇరాన్ 45 వేల మందికి మృతికి కారణమైందన్నారు.ఇరాన్ నౌకాదళం, ఎయిర్‌ఫోర్స్‌ను పూర్తిగా ధ్వంసం చేశామన్నారు. ఇరాన్ తాను చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నదని పేర్కొన్నారు. గతంలో అమెరికా అధ్యక్షులు చేసిన తప్పిదాలను తాను సరిదిద్దుతున్నానని వెల్లడించారు.
