ఫరీదాబాద్ పేలుడు పదార్థాల కేసులో అరెస్టయిన డాక్టర్ షహీన్ సయీద్‌పై ఎన్‌ఐఏ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పుల్వామా దాడుల మాస్టర్ మైండ్ ఉమర్ ఫారుక్ భార్య అపీరా బీబీతో సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అంతేకాకుండా జైషే-మహమ్మద్ చీఫ్ మసూద్ చెల్లెలితోనూ తను సంప్రదింపులు జరిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పుల్వామా అటాక్ ఈపదం వింటే చాలు భారతావని గుండె బరువెక్కుతోంది. 2019లో సీఆర్పీఎఫ్ సిబ్బంది కాన్వాయ్ పై జైషే-మహమ్మద్ అనే ఉగ్రసంస్థ జరిపిన ఈ దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడుల వ్యూహకర్తగా ఉమర్ ఫారుక్ భావిస్తారు. తాజాగా ఫరీదాబాద్‌లో అరెస్టయిన డా.షహీన్ సయీద్‌కి ఫారుక్ భార్య అపీరా బీబీతో సంబంధాలున్నట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తుంది. ఇటీవలే ఏర్పాటైన జైషే మహమ్మద్ మహిళా విభాగం జమాత్-ఉల్-మెమినాత్ లో అపీరా బీబీది ప్రధానపాత్రని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. డా. షహీన్ కేవలం అపీరాతోనే కాకుండా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ చెల్లెలితోనూ సంప్రదింపులు జరిపినట్లు ఎన్‌ఐఏ ఆరోపిస్తోంది.
మరోవైపు దేశ రాజధాని దిల్లీలో పేలుడుకు కారణమైన కారును నడిపింది డాక్టర్ ఉమర్ నబీ అని డీఎన్‌ఏ నమూనాలు తేల్చాయి. ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో సిగ్నల్ వద్ద సోమవారం కారుపేలి బీభత్సం జరిగిన తర్వాత ఘటనాస్థలిలో లభ్యమైన ఆధారాల ప్రకారం దానిని నడిపింది ఫరీదాబాద్ (హరియాణా)లోని అల్-ఫలా విశ్వవిద్యాలయం సహాయ ప్రొఫెసరైన నబీయేనని తేలింది. కారు స్టీరింగ్, యాక్సిలరేటర్ మధ్య లభ్యమైన కాలు భాగానికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి, అతడి తల్లి డీఎన్‌ఏతో సరిపోల్చారు. రెండూ సరిపోయాయి.
దీంతో పేలుడు సమయంలో వాహనంలో ఉన్నది అతడేనని నిర్ధారణ అయింది. తీవ్రంగా గాయపడిన వారిలో మరో వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మరణించడంతో మృతుల సంఖ్య 13కు చేరింది. పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలోని ఓ దుకాణం పైకప్పు మీద.. తెగిపోయిన స్థితిలో చెయ్యి కనిపించింది. దానిని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు. పేలుళ్లతో సంబంధం ఉన్న తెల్లని హ్యుందాయ్ ఐ-20 కారు తునాతునకలై కాలిపోగా, ఎర్రని ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారు వేరేచోట లభ్యమైంది. మూడోదైన మారుతి బ్రెజ్జా కారు ఫరీదాబాద్‌లోని అల్-ఫలా విశ్వవిద్యాలయంలో కనిపించింది. హరియాణాలో రిజిస్టరైన ఈ కారును కశ్మీర్ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఎకో స్పోర్ట్ కారును ఫోరెన్సిక్ నిపుణులు తనిఖీ చేయగా అమ్మోనియం నైట్రేట్ ఆనవాళ్లు కనుగొన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు మరో నాలుగు నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారని బయటపడింది. కేసుల దర్యాప్తు పురోగతిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి సమీక్షించారు.
అదుపులోకి ఇద్దరు
ఉత్తర్ ప్రదేశ్‌లోని హాపుర్‌లో జీఎస్ వైద్య కళాశాల సహాయ ఆచార్యుడు డాక్టర్ ఫారూఖ్‌ను దిల్లీ పోలీసులు, కాన్పూర్‌లో వైద్య విద్యార్థి (కార్డియాలజీ) డాక్టర్ మహ్మద్ ఆరిఫ్ మీర్ (32)ను యూపీ ఉగ్రవాద వ్యతిరేక దళం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ జమ్మూ కశ్మీర్‌కు చెందినవారు. ఫారూఖ్ వైద్య విద్య చదివింది అల్-ఫలా విశ్వవిద్యాలయంలోనే. ప్రశ్నించేందుకు ఆరిఫ్‌ను దిల్లీకి తరలించారు. కశ్మీరులోని అనంతనాగ్ వాస్తవ్యుడైన అతడు, మూడు నెలల క్రితమే కాన్పుర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కార్డియాలజీ కోర్సులో చేరాడు.
ఫరీదాబాద్ కేసులో నిందితురాలు డాక్టర్ షాహీన్ సహాయ ప్రొఫెసర్‌గా పని చేసింది ఈ కళాశాలలోనే. విచారణలో ఆరిఫ్ పేరును ఆమె వెల్లడించినట్లు సమాచారం. గురువారం తెల్లవారుజామున ఆరిఫ్ ఇంటికి ఏటీఎస్ పోలీసులు చేరుకోగా, హడావుడిగా ఫోన్లోని డేటాను తొలగించడానికి యత్నించాడు. పోలీసులు ఆ ఫోనును, లాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. కాల్ రికార్డులు, సందేశాల సారాంశాన్ని బట్టి అతడు దిల్లీ పేలుళ్ల కుట్రదారులతో సంబంధాలు కలిగిఉన్నట్లు తెలుస్తోంది. సమాచారాన్ని పంచుకునేటప్పుడు నిందితులంతా ఒకే ఈ-మెయిల్ ఐడీని వినియోగించారని గుర్తించారు. అల్-ఫలా విశ్వవిద్యాలయం వ్యవహారాలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
ఉమర్‌తో ముజమ్మిల్ గొడవ ?
ఐఈడీ పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించడం కోసం రూ.3 లక్షల విలువైన 26 క్వింటాళ్ల ఎరువుల్ని వారు కొన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ లావాదేవీలు, సరకు అందజేత వివరాలు పోలీసుల చేతికి చిక్కాయి. డబ్బు వినియోగించే విషయంలో ఉమర్, ముజమ్మిల్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, ఈ క్రమంలోనే కారులోని బాంబు పేలిందని అంటున్నారు. వారిద్దరి గొడవ వల్ల ఉగ్రవాదుల పన్నాగం మారిందా.. దాడి సమయం మారిందా.. అనేది తెలుసుకునే ప్రయత్నంలో దర్యాప్తు అధికారులు ఉన్నారు. సేకరించిన డబ్బును నిర్వహణ ఖర్చుల కోసం ఉమర్ నబీకి అందించారని నిఘా వర్గాలు గుర్తించాయి.
The post Dr Shaheen: పుల్వామా మాస్టర్‌మైండ్ తో డాక్టర్ షహీన్ కు లింకులు ? appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
