ఓటరు జాబితాల ‘ప్రత్యేక ముమ్మర సవరణ’ (ఎస్‌ఐఆర్) రెండోదశను తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ప్రకటించారు. గోవా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లలో వెంటనే ఈ కసరత్తు చేపట్టనున్నామని తెలిపారు. 2026 ఫిబ్రవరి నాటికి ఇది పూర్తవుతుందని చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్‌లలో 2026లో ఎన్నికలు జరగబోతున్నాయని, అస్సాంలోనూ ఎన్నికలున్నా అక్కడి సవరణపై ప్రకటనను విడిగా వెలువరిస్తామని స్పష్టంచేశారు. పౌరసత్వ చట్టం వల్ల అస్సాంలో నిబంధనలు విడిగా ఉంటాయని తెలిపారు.
ఇప్పటివరకు తొమ్మిదిసార్లు
స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటివరకూ ముమ్మర సవరణలు దేశంలో తొమ్మిదిసార్లు నిర్వహించామని, చివరిసారిగా 2002-04 మధ్య ఎస్‌ఐఆర్ జరిగిందని జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. ‘ఒక్క అప్పీలుకూ అవకాశం లేకుండా బిహార్‌లో తొలివిడత ఎస్‌ఐఆర్ ఇటీవలే పూర్తిచేశాం. ఈ విడతలో 51 కోట్లమందిని పరిశీలిస్తాం. అర్హుడైన ఏ ఒక్క ఓటరునూ జాబితా నుంచి తొలగించబోం. అప్పీలు అవకాశం ఉంటుంది. అర్హులైన ఓటర్లే జాబితాలో ఉంటారు. తొలగించినవారి పేర్లను స్థానిక కార్యాలయాల్లో ప్రదర్శిస్తాం’ అని వివరించారు. పశ్చిమబెంగాల్‌తో ఈసీకి ఎలాంటి ఘర్షణా లేదని, రాజ్యాంగబద్ధ విధిని తాము నిర్వర్తిస్తున్నామని స్పష్టంచేశారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనకు సిబ్బందిని సమకూర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు.
ఆధార్ పరిగణనలోకి
ఎస్‌ఐఆర్‌కు ప్రజలు సమర్పించాల్సిన పత్రాల్లో ఆధార్‌నూ చేర్చాలని ఈసీ నిర్ణయించింది. బిహార్‌లో ఎస్‌ఐఆర్ తర్వాత ప్రచురించిన ఓటర్ల జాబితానూ ఇలా ఆధారంగా చూపించేందుకు వీలుందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఆదేశాలిచ్చింది. మునుపటి ఎస్‌ఐఆర్ ఆధారంగా ఓటర్ల మదింపు దరఖాస్తుల్లో నింపిన వివరాలు సరిపోకపోతే ఓటర్ల నమోదు అధికారులు నోటీసులు జారీచేస్తారు. అప్పుడు ఓటర్లు తమవద్దనున్న పత్రాలు సమర్పించాలి. 1987 జులై ఒకటో తేదీకి ముందు ప్రభుత్వ, స్థానిక సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎల్‌ఐసీ, ప్రభుత్వరంగ సంస్థల్లో ఏవైనా జారీచేసిన ఐడీ కార్డులు, పింఛన్ చెల్లింపు ఉత్తర్వులు వంటివి దీనికి చెల్లుతాయి. పుట్టిన తేదీని ధ్రువీకరించే పత్రం, పాస్‌పోర్ట్, విద్యార్హతల పత్రాలు, శాశ్వత నివాస ధ్రువపత్రం, అటవీహక్కుల చట్టం, కుల ధ్రువీకరణ పత్రం.. వీటిలో ఏవి ఉన్నా సమర్పించవచ్చు. ఈ 12 రాష్ట్రాల్లో ఎవరైనా ఒక వ్యక్తి బిహార్ ఓటర్ల జాబితాలో తమ తల్లిదండ్రుల పేర్లను చూపిస్తే అప్పుడు.. పుట్టినతేదీ ధ్రువపత్రం మినహా పౌరసత్వ ధ్రువీకరణకు ఎలాంటి పత్రాలు ఇవ్వాల్సిన పనిలేదని ఈసీ తెలిపింది.
ఈసీ విశ్వసనీయత ప్రశ్నార్థకం – కాంగ్రెస్
ఓటర్ల జాబితాల సవరణలో ఈసీ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా ఉందని, ఓటర్లు గానీ, విపక్షం గానీ సంతృప్తి వ్యక్తంచేయడం లేదని కాంగ్రెస్ పేర్కొంది. బిహార్‌లో ఒక్క ఓటరునూ తొలగించకపోగా 65 లక్షల మందిని చేర్చిన నేపథ్యంలో ఎస్‌ఐఆర్‌పై లేవనెత్తిన ప్రశ్నలకు ఇంతవరకు సమాధానాలు రాలేదని పార్టీ ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేడా చెప్పారు. ఓటర్ల జాబితా సవరణతో తమకెలాంటి ఇబ్బంది లేదని, ఈ పేరుతో అర్హులైన ఓటర్లను తొలగించడానికి ఎలాంటి ప్రయత్నం జరిగినా ప్రజాస్వామ్యయుతంగా అడ్డుకుంటామని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. ఎన్నికల్లో వరస ఓటములకు సాకులు వెతుక్కోవడంలో భాగంగానే ఎస్‌ఐఆర్‌ను విపక్షం తప్పుపడుతోందని భాజపా ఆరోపించింది. విపక్షాలను ‘అసంతృప్త ఆత్మల మంద’గా నిందించింది. అవి కపట బుద్ధికి మారుపేరు అని పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా విరుచుకుపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో సవరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నవారే ఈ ప్రక్రియను ఇప్పుడు తప్పుబట్టడమేంటని ప్రశ్నించారు.
ఎస్‌ఐఆర్-2 జరిగేది ఇలా
ఎన్యూమరేషన్ పత్రాల ముద్రణ, శిక్షణ: మంగళవారం నుంచి వచ్చే నెల 3 వరకు
ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నమోదు: నవంబరు 4 నుంచి డిసెంబరు 4 వరకు
ముసాయిదా ఓటరు జాబితాల ప్రచురణ: డిసెంబరు 9
అభ్యంతరాల స్వీకరణ: డిసెంబరు 9 నుంచి 2026 జనవరి 8
వీటి విచారణ, పరిశీలన: డిసెంబరు 9 నుంచి 2026 జనవరి 31
తుది ఓటరు జాబితా ప్రచురణ: 2026 ఫిబ్రవరి 7
The post Election Commission: తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్-2 appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
