ఉగ్రవాద ఆరోపణలతో అరెస్టయిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దిన్ నివాసంలో గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీ ఎస్)పోలీసులు బుధవారం సోదాలు నిర్వహించారు. రాజేంద్రనగర్‌లోని అతడి నివాసంలో 3 గంటలపాటు సోదాలు నిర్వహించి పలు పత్రాలు, రసాయనాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడుకు రెండు రోజుల ముందు ఏటీఎస్ పోలీసులు ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో మొహియుద్దీన్ కూడా ఉన్నాడు. మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న ఏటీఎస్ బృందం.. మొహియుద్దీన్ ఇంటికి రాత్రి 2 గంటలకు చేరుకుంది. ఇంట్లో 3 గంటలపాటు సోదాలు నిర్వహించింది.
నగరంలో కొనసాగుతున్న హై అలర్ట్
ఢిల్లీ కారు బాంబు పేలుడు నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో హై అలర్ట్ కొనసాగుతోంది. గత మూడు రోజులుగా నగరంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ దేవాలయాలు, ఎంజీబీఎస్, జేబీఎస్ ఇతర బస్ట్టాండ్లు, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్పీఎఫ్ పోలీసులు డాగ్‌స్క్వాడ్, బాంబు స్క్వాడ్లతో వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారిని గుర్తించి అన్ని రకాల ధ్రువపత్రాలు పరిశీలిస్తున్నారు.
21న రాష్ట్రపతి, 16న ఉపరాష్ట్రపతి హైదరాబాద్ రాక
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హైదరాబాద్ లో పర్యటించనున్న నేపథ్యంలో… విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సీఎస్ కె.రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం డా.బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. ‘‘ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ఈ నెల 16న మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ అందించే తేనేటి విందు స్వీకరిస్తారు. అనంతరం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత రాత్రి 8 గంటలకు ఆయన దిల్లీకి పయనమవుతారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 21న బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాజ్‌భవన్‌లో బస అనంతరం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన భారతీయ కళామహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 22వ తేదీన పుట్టపర్తి పర్యటనకు బయలుదేరుతారు’’ అని సీఎస్ పేర్కొన్నారు. సమావేశంలో డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
The post Gujarat ATS: హైదరాబాద్ ఉగ్రవాది ఇంట్లో గుజరాత్ ఏటీఎస్ సోదాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
