Hyderabad | సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): సైబర్‌నేరాలు తగ్గుతున్నాయని ఒక పక్క అధికారులు చెబుతున్నా.. మరో పక్క నేరగాళ్లు పంజా విసురుతూనే ఉన్నారు. ఈ ఏడాది మొదటి రోజే మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ఇద్దరు వ్యక్తుల నుంచి సైబర్‌నేరగాళ్లు రూ. 4.5 కోట్లు కొట్టేశారు. స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలొస్తాయని నమ్మిస్తూ… స్క్రీన్‌పై రూ.కోట్ల లాభం చూపించి.. వాటిని విత్ డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్‌లు చెల్లించాలని నమ్మిస్తూ రూ.కోట్లు కాజేశారు. మోసపోయిన వారిలో ఒకరు వ్యాపారి కాగా… మరొకరు డిఫెన్స్ సంస్థలో పనిచేసిన రిటైర్డు అధికారి కావడం గమనార్హం.
తన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, తెలిసిన వారు, బంధువుల వద్ద అప్పులు తెచ్చి ఇందులో పెట్టుబడి పెట్టగా ఒక్క రూపాయి లాభం చూపించి సైబర్‌నేరగాళ్లు కోట్లు కొట్టేశారు. పెద్ద అంబర్‌పేట్ ప్రాంతంలో నివాసముండే వ్యాపారి గత ఏడాది నవంబర్‌లో ఫేస్‌బుక్ బ్రౌజ్ చేస్తుండగా ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించిన ప్రకటన కన్పించింది. దానిని క్లిక్ చేయడంతో నోముర సెక్యూరిటీస్‌కు సంబంధించి నోముజీక్యూ ఐ-189 పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌కు బాధితుడి నెంబర్‌ను యాడ్ చేశారు. ఆ గ్రూప్‌లో ఉన్నవారు స్టాక్స్ గురించి చర్చించుకుంటూ మేం ఫలాన స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే ఇన్ని లాభాలొచ్చాయని చెప్పుకుంటూ స్క్రీన్ షాట్స్ షేర్ చేశారు. దీంతో తాను కూడా ట్రేడింగ్ చేసేందుకు ముందుకెళ్లాడు.
ఈ నేపధ్యంలోనే సైబర్‌నేరగాళ్లు పంపించిన హెచ్5.ఏఆర్‌ఏవైఏఏ.ఆఆ పేరుతో పంపించిన లింక్‌ను క్లిక్ చేసి, యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, అకౌంటర్ క్రియేట్ చేసుకున్నాడు. బాధితుడికి కావ్యారెడ్డి అనే పేరుతో ఒక చీఫ్ అపరేటర్, అడ్వయిజర్‌ను కేటాయించారు. దీంతో మొదట రూ.40 వేలు పెట్టుబడి పెట్టడంతో కొన్ని లాభాలు కన్పించాయి. వాటిని విత్‌డ్రా చేసుకున్నాడు. మీరు ఇలా చేస్తే ఎక్కువ లాభాలు రావని, క్యూ1బీ క్యాటగిరిలో ఐపీవోలు, హైనెట్ వర్త్ స్టాక్స్‌పై పెట్టుబడి పెడితే భారీ లాభాలు ఆర్జించవచ్చంటూ సూచనలు చేశారు. ఇలా రూ.49.6 లక్షలు పెట్టుబడి పెట్టడంతో యాప్‌లు పెట్టుబడితో పాటు లాభాలు రూ.1.68 కోట్లుగా కన్పించాయి. దీంతో భారీ లాభాలొస్తాయంటూ నమ్మించారు.
తరువాత దఫ దఫాలుగా రూ. 2 కోట్ల వరకు పెట్టుబడి పెడుతూ వెళ్లాడు. స్క్రీన్‌పై రూ.9.28 కోట్ల లాభం కన్పించింది. స్క్రీన్‌పై కన్పిస్తున్న లాభాలు, పెట్టుబడులలో నుంచి విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో సైబర్‌నేరగాళ్లను ప్రశ్నించాడు. ముందుగా మీరు రూ. 80.67 లక్షలు కమిషన్ చెల్లించాలని, ఆ తరువాతే మీకు విత్ డ్రా చేసుకునే అవకాశముంటుందని సూచించారు. అయితే వ్యాలెట్‌లో ఉన్న వాటిలో అవి మినహాయించుకొని మిగతావి ఇవ్వాలని బాధితుడు కోరితే.. అలా కుదరదని ముందుగా కమిషన్ చెల్లించాలని షరత్ విధించడంతో బాధితుడికి అనుమానం వచ్చి ఈ నెల 1వ తేదీన మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
రిటైర్డు డిఫెన్స్ ఉద్యోగికి టోకరా
కాప్రా ప్రాంతంలో నివాసముండే బాధితుడు డిఫెన్స్ సంస్థలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. టెలిగ్రామ్ యాప్‌ను బ్రౌజింగ్ చేస్తుండగా ఏపీ హెల్పింగ్ హ్యాండ్ ఇండియా పేరుతో ఒక లింక్ వచ్చింది. ఆ లింక్‌ను క్లిక్ చేయడతో తాము స్టాక్ ట్రేడింగ్‌లో విశ్లేషణ, స్టాక్స్ కొని అమ్మడంలో కస్టమర్‌కు సూచనలు, రిస్క్ మేనేజ్‌మెంట్ చేస్తూ అధిక లాభాలిప్పిస్తామని ఒక అప్లికేషన్ కన్పించింది. అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న బాధితుడికి అమన్‌కుమార్ పేరుతో ఒక వ్యక్తి ఫోన్ చేసి కొన్ని సూచనలు చేశాడు, ఆ తరువాత బేస్ ఫార్మలీ కాయిన్ బేస్ వ్యాలెట్ పేరుతో ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేయించాడు. క్రిప్టో కరెన్సీతో బియాన్స్‌లో ట్రేడింగ్ చేస్తే భారీ లాభాలొస్తాయని నమ్మించాడు. ఈ మేరకు ఆ యాప్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకొని ట్రేడింగ్ మొదలు పెట్టాడు.
దీనికి అమన్‌కుమార్‌తో పాటు అజిత్ దోవల్ అనే పేర్లతో ఇద్దరు వ్యక్తులు సలహాలు, సూచనలు ఇస్తూ వెళ్లారు. మీరు పెట్టే పెట్టుబడిని రూపాయ నుంచి యుఎస్‌డీటీలోకి మార్చి, మీ వ్యాలెట్‌లో డిపాజిట్ చేయాల్సి ఉంటుందంటూ సూచనలు చేశారు. ఇదంతా ఇండియా, యూఎస్-ప్రీ మార్కెట్ ట్రేడింగ్‌పై ఆధారపడి ఉంటుందని నమ్మించారు. ఇలా బాధితుడు మొదట రూ. 3.85 లక్షలు పెట్టుబడి పెట్టడంతో కొన్ని లాభాలు చూపించారు. ఆ తరువాత మరో మూడు లక్షలు పెట్టుడి పెట్టాడు. అయితే యాప్‌లో స్క్రీన్‌పై రూ. 4.55 కోట్లు (5 లక్షల యుఎస్‌డీటీ) చూపించింది.
అందులో ఉన్న వాటిని విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించడంతో మీ లాభాలు అధికంగా ఉన్నాయని, అందుకే ప్రాఫిట్‌పై 30 శాతం ట్యాక్స్ చెల్లించాలని షరత్ విధించారు. దీంతో బాధితుడు రూ. 12.97 లక్షలు చెల్లించాడు, ఆ తరువాత రూ. 50 లక్షలు చెల్లిస్తూ వెళ్లాడు. ఇలా 494 సార్లు… రూ. 2,27,85,000 సైబర్‌నేరగాళ్లు సూచించిన ఖాతాలలోకి డిపాజిట్ చేశాడు. ఇందులో ఒక్క రూపాయి మాత్రమే తనకు లాభం అంటూ సైబర్‌నేరగాళ్లు ఇచ్చారని, తన రిటైర్ బెనిఫిట్స్‌తో పాటు బంధువులు, తెలిసిన వారి వద్ద అప్పులు తెచ్చి సైబర్‌నేరగాళ్లు సూచించినట్లు డిపాజిట్ చేశానని బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
