Hyderabad | సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): నగర శివారులో దొంగలు హల్చల్ చేస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు..కాలేజీలు, గేటెడ్ కమ్యూనిటీలను కూడా వదలకుండా వరుస చోరీలు జరుగుతున్నాయి..ఒక కేసును ఛేదించకముందే.. మరో చోరీ ఘటనకు పాల్పడుతూ దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. వరుస దొంగతనాలు చేస్తుంది.. పాత నేరస్తుల ముఠానా? కొత్త ముఠాలా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గత శుక్రవారం అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలోని బ్రిలియంట్ విద్యా సంస్థలకు చెందిన రూ. 1.07 కోట్లు దొంగలు అపహరించారు.
ఈ ఘటన తెలిసిన వారి పనా? ఏపీ పోలీసుల నుంచి పరారైన బత్తుల ప్రభాకర్ పనా? కొత్త ముఠాలా పనా? అనే విషయాలపై పోలీసులు విశ్లేషిస్తున్నారు. కాలేజీకి సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ఈజీగా దొంగలు కాలేజీలో చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. పరారీలో ఉన్న ప్రభాకర్ చేసిన దొంగతనాల మాదిరిగానే మరో ముఠా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ర్టాల్లో ఇలాంటి దొంగతనాల గూర్చి వివరాలు సేకరించిన పోలీసులు కొన్ని ముఠాలను గుర్తించినట్లు సమాచారం. అనుమానితులను అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసు ఛేదించడంలో పోలీసులు మూడు రోజులైనా సరైన ఫలితాన్ని రాబట్టకముందే, పక్క పోలీస్‌స్టేషన్ పరిధి అయిన హయత్‌నగర్ ఠాణా పరిధిలోని అంబర్పేట్ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీలో వరుస దొంగతనాలు జరగడం ఆందోళన కల్గిస్తోంది. ఆదివారం పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ముసుగు దొంగలు స్వైర విహారం చేశారు.
హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత పెద్దఅంబర్‌పేట్‌లోని సదాశివ ఎన్క్లేవ్, గేటెడ్ కమ్యూనిటీలో నివాసముండే రిటైర్డు లెక్చరర్ గూడూరు రాజేందర్ ఇంటి తాళాలు పగలగొట్టి 3 తులాల బంగారం, 4 కిలోల వెండి ఆభరణాలతో పాటు కొంత నగదును అపహరించారు. అదే కాలనీలో బీవీకే రెడ్డి ఇంట్లో నుంచి మూడు తులాల బంగారు ఆభరణాలు, రెండున్నర కిలోల వెండిని అపహరించారు.
కొంపల్లి దేవేందర్‌నగర్ కాలనీలో దొంగలు తాళం వేసిన ఆనంద్‌రావు ఇంటి తాళాలు పగలగొట్టి కొంత బంగారం, కిలో వెండి వస్తువులతో పాటు కొంత నగదును అపహరించారు. అ పక్కనే ఉన్న హన్మంత్ అనే వ్యక్తికి చెందిన కార్యాలయంలోను దొంగలు చొరబడ్డారు.
అబ్దులాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బ్రిలియంట్ విద్యా సంస్థలో విద్యార్థుల ఫీజులకు సంబంధించి వసూళ్లయిన సొమ్ము రూ. 1.07 కోట్లు గురువారం అర్ధరాత్రి తరువాత దొంగిలించారు.
వారం రోజుల క్రితం పారామౌంట్ కాలనీలో నివాసముండే స్వప్న ఇంటి ఇంటి తాళాలు పగులగొట్లిన దొంగలు ఇంట్లో నుంచి 43 తులాల బంగారు ఆభరణాలు, కొంత క్యాష్‌ను అపహరించడంతో ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
గత వారం చందానగర్‌లోని ఓల్డ్ ఎంఐటీ క్వార్టర్స్‌లో రిటైర్డు బీహెచ్ఎల్ ఉద్యోగి ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగలు ఇంట్లో నుంచి 17 తులాల బంగారు, 60 తులాల వెండి ఆభరణాలతో పాటు కొంత, క్యాష్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అపహరించారు.
హిమాయత్‌నగర్ స్ట్రీట్ నంబర్ 6లో ఉన్న హెరిటేజ అపార్ట్మెంట్లో వృద్ధ దంపతులపై దాడిచేసిన కేర్‌టేకర్ ఎనిమిది తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లాడు.
