Hyderabad | మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్ల నుంచి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నది. ఇండ్లను కూలుస్తూ, భూములను ఇష్టానుసారం లాక్కుంటూ నగర ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎప్పుడు ఎవరి ఇండ్లను కూలుస్తారో, ఎప్పుడు ఎవరి భూమి మీదకు వస్తారో తెలియని పరిస్థితి. ఒకవైపు హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూలుస్తూ నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. మరోవైపు మూసీ సుందరీకరణ పేరిట పట్టా భూముల్లో ఏండ్ల తరబడిగా కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూలుస్తూ.. రూ.లక్షలాది విలువ చేసే ప్లాట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. ఖాళీ స్థలాలతో పాటు అపార్ట్‌మెంట్లను కూడా ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రజలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా పట్టించుకోవడం లేదు. పైగా కొద్దిరోజులుగా మూసీ చుట్టుపక్కల గల భూములకు సంబంధించి ప్రభుత్వం వందలాది ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు సర్వేలు ప్రారంభించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భూములు వదులుకునే ప్రసక్తే లేదు..
మూసీ సుందరీకరణలో భాగంగా కిస్మత్‌పూర్, దర్గా ఖలీజ్‌ఖాన్, హిమాయత్‌సాగర్‌లో అధికారులు సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా నదీగర్భం నుంచి 500 మీటర్ల విస్తీర్ణంలో భూసేకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. అధికారులు చెప్పిన 500 మీటర్ల పరిధిలో వందలాది మంది ప్రజలకు చెందిన ప్లాట్లు, ఇండ్లు ఉన్నాయి. 30 ఏండ్ల కిందటే పక్కా పట్టా భూములను కొనుగోలు చేస్తే.. ఆ భూములకు ధరలు పెరగగానే కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నదని భూముల యజమానులు వాపోతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు తమ భూములను లాక్కుంటున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తమ భూములను స్వాధీనం కానివ్వమని తెగేసి చెబుతున్నారు.
కిస్మత్‌పూర్‌లో 19.10 ఎకరాల భూమి స్వాధీనం
కిస్మత్‌పూర్ పరిధిలోని పట్టా భూముల్లో 19.10 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ భూమి సర్వే నంబర్ 115 నుంచి 126 దాకా విస్తరించి ఉన్నది. కిస్మత్‌పూర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 1996లో వ్యవసాయ భూమిగా పక్కా పట్టాలను కలిగి ఉన్నది. ఆ తర్వాత భూ యజమానులు నగరం విస్తరిస్తుండటంతో వెంచర్‌గా అభివృద్ధి చేసి విక్రయించుకున్నారు. ఇప్పుడున్న వారంతా ఆనాటి పట్టా భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొంతమంది ప్రస్తుతం ఆప్రాంతంలో ఇండ్లు కటుకోగా.. మరికొంత మంది వివిధ రూపాల్లో వినియోగించుకుంటున్నారు. ఈ భూములన్నీ హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ నుంచి దూరంగా మూసీ నది బఫర్ జోన్ బయటే ఉన్నాయి.
మూసీకి ఎంత పెద్ద వరదలు వచ్చినా హిమాయత్‌సాగర్ అన్ని గేట్లు ఎత్తినా 19.10 ఎకరాల్లోని ఒక్క గుంట భూమిలోకి కూడా వరద నీరు రాలేదు. ఇందులోని సర్వే నంబర్ 117లో కొంత ప్రభుత్వ భూమి ఉండగా దాన్ని ఔటర్ రింగ్ రోడ్డులో భూమిని కోల్పోయిన వారికి పరిహారం కింద 40 మందికి 250 గజాల చొప్పున అందజేశారు. 2006 జూన్ 6న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి కోనేరు రంగారావు పంపిణీ చేశారు. ఆ 40 మందిలో కిస్మత్‌పూర్, దర్గా ఖలీజ్‌ఖాన్, హిమాయత్‌సాగర్, కొత్వాల్‌గూడ బాధిత కుంటుంబాలు ఉన్నాయి. తాజాగా ఆ ప్లాట్లను కూడా స్వాధీనం చేసుకునేందుకు రేవంత్ సర్కార్ నోటిఫికేషన్ జారీచేసింది.
ప్రాణాలు పోయినా భూములివ్వం: 2015లో రూ.26 లక్షల బ్యాంక్ లోన్ తీసుకుని కిస్మత్‌పూర్‌లోని శ్రీసాయినగర్‌లో 400 గజాల పట్టాభూమి కొనుకున్నా. నాకు ఉన్నంతలో రేకుల ఇల్లు కట్టుకున్నా. నాకు ముగ్గురు పిల్లలున్నారు. వారు చదువుకుంటున్నారు. నేను ఏండ్ల తరబడిగా ప్రైవేట్ ఉద్యోగం చేసి నా పిల్లల కోసం సంపాదించింది ఈ ఇల్లు మాత్రమే. ఇప్పుడు అధికారులు వచ్చి నా ఇంటిని స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నారు. ఈ ఇల్లు పోతే నా పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. మూసీ నది, హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌కు నా ఇల్లు 500 మీటర్ల కంటే ఎక్కువ దూరంలోనే ఉంది. అయినా మార్కింగ్ చేసి వెళ్లారు. ప్రాణాలు పోయినా మా భూములను మాత్రం ఇవ్వం.
– సుభానీ, శ్రీసాయినగర్ కాలనీ, కిస్మత్‌పూర్
