Hyderabad | జగద్గిరిగుట్ట, జనవరి13: నగరంలో కబ్జాల పర్వం కొనసాగుతున్నది. ఓ వైపు ప్రభుత్వ స్థలం కనపడితే చాలు యథేచ్ఛగా కబ్జా చేస్తుంటే.. మరోవైపు అనుమతికి మించి భవన నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండిపెడుతున్నారు అక్రమార్కులు. జగద్గిరిగుట్ట భూదేవిహిల్స్ సమీపంలోని సర్వేనంబర్ 348లోని ప్రభుత్వ స్థలంలో కొంతకాలంగా స్థలాలు కబ్జాచేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఇటీవల అక్కడికి వెళ్లగా వారిని నిర్మాణదారులు అడ్డుకున్నారు. ఈనెల 9న మరోసారి నిర్మాణాలను పరిశీలించేందుకు వెళ్లగా అధికారులను లోనికి వెళ్లనివ్వలేదు. స్థలానికి సంబంధించిన ఆధారాలు, పత్రాలు అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో సంబంధిత స్థలంలో నిర్మాణాలు చేపడుతున్న కాశీం, సామేలు, రాము, అంజయ్య, మహేష్, జ్యోతిపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కలీం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహాదేవపురంలో అనుమతిలేని నిర్మాణం
గాజులరామారం సర్కిల్ పరిధి మహదేవపురం సెకండ్‌ఫేజ్‌లో ఆంజనేయులు అనే వ్యక్తి నిబంధనలు అతిక్రమించి అదనపు అంతస్తుతోపాటు పెంట్‌హౌస్ నిర్మించాడు. దీంతో 3 నెలలక్రితం టౌన్‌ప్లానింగ్ అధికారులు నోటీసులు ఇచ్చి భవనాన్ని సీజ్ చేశారు. అయితే నిర్మాణదారుడు మున్సిపల్ సిబ్బంది ఏర్పాటు చేసిన సీళ్లు తొలగించి తిరిగి పనులు చేపట్టాడు. విషయం తెలుసుకున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు ఈనెల 9న జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
విద్యార్థుల ఆటస్థలంపై రియల్టర్ కన్ను..
ఆర్కేపురం, జనవరి 13 : సరూర్‌నగర్ మండలం కొత్తపేట పాపడం హోటల్ వెనుక భాగంలోని సర్వే నంబర్ 9/1లో 3వేల గజాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇందులోని 900 గంజాలను ఇప్పటికే ఫైర్ స్టేషన్‌కు కేటాయించగా మిగిలిన 2,100 గజాల స్థలంలో బొమ్మనగండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆట స్థలంగా వినియోగించుకునేవారు. నిజానికి ఈ సర్వే నంబర్‌లోని భూమికి గతంలోనే ఏడీ సర్వేచేసి హద్దులు నిర్ధారించి ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అయితే స్థానికంగా ఉన్న ఓ రియల్టర్ విలువైన ఈ భూమిపై కన్నేశాడు. 9/1/2 సర్వే నంబర్‌తో క్ల్లెయిమ్ చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లలు ఆడుకునేందుకు కేటాయించిన ప్రభుత్వ భూమి చుట్ట్టూ ప్రహరీ నిర్మించి, కబ్జాదారుల బారినుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
