Hydraa | బడంగ్పేట్, ఏప్రిల్ 12 : ‘పేదల ఇండ్లు కూల్చడమే హైడ్రా లక్ష్యమా?.. పెద్దోళ్ల ఇండ్లు చెరువుల్లో ఉన్నా పట్టించుకోరా?.. ప్రభుత్వ భూములు వందల ఎకరాల్లో ప్రైవేట్ కంపెనీలు వెలుస్తుంటే కండ్లు మూసుకున్నారా?.. నాదర్గుల్లో ఇంత జరుగుతున్నా హైడ్రాకు కనిపిస్తలేదా?.. పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు మరో న్యాయమా? సమాధానం చెప్పాలి’ అని పీవోడబ్ల్యూ జాతీయ అధ్యక్షురాలు సంధ్య, కార్యదర్శి ఝాన్సీ, ఐఎఫ్టీయూ నాయకురాలు అనురాధ హైడ్రాను నిలదీశారు. బాలాపూర్ మండలం నాదర్గుల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 613లో 373.22 ఎకరాల రైతుల భూములను వివిధ కంపెనీలు తన్నుకుపోతుంటే ఎందుకు మౌనం వీడటం లేదని నిగ్గదీశారు. మా భూములు మాకేనని రైతులు చేస్తున్న పోరాటానికి ప్రగతిశీల మహిళాసంఘాలు, పీవైఎస్, పీడీఎస్‌యూ, ఐఎఫ్టీయూ తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రైతులకు సంఘీభావం తెలిపారు. రైతులతో అనేక విషయాలు చర్చించారు.
గత పది రోజులుగా రైతులు పడుతున్న ఇబ్బందులు గురించి తెలుసుకున్నారు. రైతుల దగ్గర ఉన్న పన్ను రసీదులు, ఇతర దస్ర్తాలు పరిశీలించారు. రైతులతో మాట్లాడి భూమిని చూద్దామని వెళ్తుండగా అదిబట్ల పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు, ప్రజాసంఘాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ సందర్భంగా సంధ్య, ఝాన్సీ, అనురాధ మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతుల భూములు లాక్కోవడమేనా? అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు అమలుచేయమంటే రైతులపై కేసులు పెడ్తారా? నాదర్గుల్లో ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు? అని నిలదీశారు. ప్రభుత్వం పేదల పక్షమా? ప్రైవేట్ కంపెనీల పక్షమా? తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని, సర్కార్‌కు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.
ఆదిబట్ల పోలీసుల ఓవర్‌యాక్షన్
‘నాదర్గుల్లో ఆదిబట్ల పోలీసులు ఓవర్‌యాక్షన్ చేస్తున్నారు. రైతులు భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. రైతులకు మద్దతు ఇస్తున్న పార్టీలు, ప్రజాసంఘాలపై ఆంక్షలు పెడుతున్నారు. సర్వే నంబర్ 613లోని 373.22 ఎకరాల భూమిని కార్పొరేటర్ కంపెనీలు తన్నుకు పోతుంటే పోలీసులు కాపలా ఉంటున్నారు’ అని సంధ్య, ఝాన్సీ, అనురాధ ఆరోపించారు. రైతులపై కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రజలకు కాపలా ఉండాల్సిన పోలీసులు.. ప్రైవేట్ వ్యక్తులకు కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు.
రైతులకు పట్టాలు ఇచ్చేవరకు పోరాడుతాం : పీవోడబ్ల్యూ
నాదర్గుల్ భూములకు సంబంధించి రైతులకు పట్టాలు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని పీవోడబ్ల్యూ జాతీయ అధ్యక్షురాలు సంధ్య బాధితులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ద్వంద్వవైఖరి అవలంబిస్తుందని మండిపడ్డారు. వందలాది మంది పోలీసుల ఎందుకు ఉన్నారో చెప్పాలని నిలదీశారు. మూడు తరాలుగా సాగు చేసుకుంటున్న రైతులను ఇక్కడి నుంచి ఎల్లగొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. భూముల చుట్టూ వేసిన ఫెన్సింగ్ తొలగించాలని డిమాండ్‌చేశారు. ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఎంతోకాలం నిలువలేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకుడు పరశురాం, పీడీఎస్‌యూ నాయకులు పాల్గొన్నారు.
