ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ దుమ్మురేపాడు. కెరీర్‌లో అత్యుత్తమ టెస్టు రేటింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకిన సిరాజ్.. 12వ స్థానానికి చేరుకున్నాడు. హైదరబాదీ పేసర్ ఖాతాలో ప్రస్తుతం 718 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఏడు వికెట్లు పడగొట్టడంతో సిరాజ్ దూసుకొచ్చాడు. అక్టోబర్ 10 నుంచి న్యూఢిల్లీలో ఆరంభం కానున్న రెండో టెస్టులో కూడా చెలరేగితే.. తర్వాతి ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Team India: ధోనీ, కోహ్లీ, గంగూలీ.. అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించింది ఎవరు?
టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బుమ్రా ఖాతాలో 885 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 7 స్థానాలు ఎగబాకి.. 21 ర్యాంకులో నిలిచాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ (908) నంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్నాడు. యశస్వి జైస్వాల్ ఐదవ ర్యాంక్‌లో ఉన్నాడు. రిషభ్ పంత్ 8, శుభ్‌మన్ గిల్ 13 స్థానాల్లో కొనసాగుతున్నారు. విండీస్‌పై సెంచరీ చేసిన రవీంద్ర జడేజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లో ఉత్తమ రేటింగ్ పాయింట్లు సాధించాడు. జడేజా 6 స్థానాలు మెరుగై 25వ స్థానానికి ఎగబాకాడు. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా టాప్‌లో ఉన్నాడు.
