భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ అక్టోబర్ 10 నుంచి న్యూఢిల్లీలో ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను భారత్ చిత్తుగా ఓడించింది. ఈ ఓటమి తర్వాత వెస్టిండీస్ హెడ్ కోచ్, విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ తాను విమర్శలకు సిద్ధంగా ఉన్నానని ఒప్పుకున్నాడు. ఒకప్పుడు ఆధిపత్యం చెలాయించిన కరేబియన్ టెస్ట్ జట్టు పతనానికి ఇటీవలి తన నిర్ణయాలు కాదని, దశాబ్దాల నాటి లోపాలే అని స్పష్టం చేశాడు. ఢిల్లీలో భారత్‌తో జరిగే రెండో టెస్టుకు ముందు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ మీడియాతో మాట్లాడాడు. గత నాలుగు దశాబ్దాలుగా భారతదేశంలో వెస్టిండీస్ ఎందుకు సిరీస్ గెలవలేదో చర్చిస్తున్నామని చెప్పాడు.
‘భారతదేశంలో మేము చివరిసారిగా 1983లో టెస్ట్ సిరీస్ గెలిచాం. అప్పుడు నేను పుట్టాను. వెస్టిండీస్ 42 సంవత్సరాలుగా భారతదేశంలో టెస్ట్ సిరీస్ గెలవలేదు. నాపై అందరి కళ్ళు ఉంటాయని తెలుసు. విమర్శలు వస్తాయని కూడా తెలుసు. వెస్టిండీస్ క్రికెట్ పతనం రెండేళ్ల క్రితం ప్రారంభం కాలేదు, ఇది దశాబ్దాలుగా జరుగుతోంది. ఇది క్యాన్సర్ లాంటిది. క్యాన్సర్‌కు చికిత్స చేయకపోతే ఏమి జరుగుతుందో మనకు తెలుసు. ఇది రొమ్ము క్యాన్సర్ నెల కాబట్టి.. ఉదాహరించడానికి మంచి మార్గం అనుకుంటున్నా. మా సమస్యలు పైపైన లేవు, వ్యవస్థలో లోతుగా పాతుకుపోయాయి’ అని డారెన్ సామీ చెప్పాడు. సామీ విండీస్ సంక్షోభాన్ని మహమ్మారి క్యాన్సర్‌తో పోల్చాడు.
Also Read: Sanju Samson: 10 ఏళ్లలో 40 మ్యాచ్‌లు మాత్రమే ఆడా.. భావోద్వేగం చెందిన సంజు శాంసన్!
‘మేము ఐదు టెస్ట్ మ్యాచ్‌లను ఒకే చోట ఆడుతున్నాము. ఇక్కడ ఇతర బోర్డులు ప్రయోజనం పొందాయి. మన దగ్గర ఉన్న దానితో మాత్రమే మనం పని చేయగలం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ఫ్రాంచైజీలతో సరిపోలలేకపోవడం ఒక సమస్య. మా జట్టు ఆటగాళ్లకు ఒకటే చెబుతా.. ఇతర జట్ల మాదిరిగా మనకు ఉత్తమ సౌకర్యాలు, సాంకేతికత లేదని. ఇదే వాస్తవం. మేం ప్రతికూల స్థితిలో ఉన్నాము. విండీస్ క్రికెట్ అభివృద్ధి చెందడానికి ఆర్థిక వనరులు చాలా అవసరం’ అని విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ చెప్పుకొచ్చాడు. మొదటి టెస్ట్‌లో భారత్ రెండున్నర రోజుల్లో వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఓడించింది.
