బతుకమ్మ, దసరా పండగనాటికి మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేయాలని నిర్ణయించిన చీరల పంపిణీ కార్యక్రమం వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ చీరల పంపిణీని దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి రోజైన నవంబర్ 19న తిరిగి పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హాయాంలో బతుకమ్మ పండగనాటికే చీరలను పంపిణీ చేసింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయన్న విమర్శల నేపథ్యంలో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బతుకమ్మ పండుగకల్లా అత్యంత నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించుకుంది.
చేనేత కార్మికులతో చీరలను ప్రత్యేకంగా తయారీ చేయించారు. అయితే బతుకమ్మ పండుగ నాటికి చీరలు సిద్ధం కాకపోవడంతో పంపిణీ సాధ్యం కాకపోవడంతో దసరా నాటికి పంపిణీ చేయాలని నిర్ణయించారు. అప్పటికీ సరిపడా చీరల తయారుకాకపోవడంతో చీరల పంపిణీని ప్రభుత్వం వాయిదా వేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ 15 నాటికి చీరల తయారీని పూర్తి చేయించి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ ఇటీవల చీరల తయారీ, పంపిణీపై సమీక్షించారు.
జిల్లాలో 18,848 గ్రూపుల్లో ఎస్‌హెచ్‌జీ సభ్యులు 1.94లక్షల మంది ఉన్నారు. వీరికి ఒక్కో చీర చొప్పున పంపిణీ చేయనున్నారు. అందుకుగాను 1.94లక్షల చీరలు అవసరం అవుతాయి. ఇప్పటివరకు జిల్లాకు 50% చీరలు మాత్రమే సరఫరా కాగా గోడౌన్లలో అధికారులు సిద్ధం చేశారు. మిగతా 50% చీరలు రావాల్సి ఉంది.
సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో
మహిళా సంఘాలకు నాయకత్వం వహించే సెర్ప్, మెప్మా సంస్థలు ఈ చీరలను పంపిణీ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్ ఆధ్వర్యంలో, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో అందించనున్నారు. మహిళల కోసం 6.5 మీటర్లు, వృద్ధుల కోసం 9మీటర్ల చీరలను రూపొందిస్తున్నారు. ఈ చీరలను ఇందిరమ్మ చీరల పథకం పేర పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. చీరల తయారీలో నాణ్యత విషయంలో రాజీ లేకుండా ఆరోపణలకు అవకాశం లేకుండా సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో మగ్గాలపై తయారు చేసిన నాణ్యమైన చీరలను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో చీరలను ప్రభుత్వం నేయించింది. రూ.800 విలువ గల ఒక్కో చీరను పంపిణీ చేయాలని నిర్ణయించారు.
The post Indiramma Saree: ఇందిరాగాంధీ జయంతికి చీరల పంపిణీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
