INDW vs SAW: మహిళల ప్రపంచకప్‌లో భాగంగా గురువారం నాడు వైజాగ్ వేదికగా ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. దక్షిణాఫ్రికా జట్టు 3 వికెట్ల తేడాతో భారత్‌పై సంచలన విజయం సాధించింది. ఈ విజయంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ నాడిన్ డి క్లెర్క్ (Nadine de Klerk) మెరుపు ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్లు స్మృతి మంధాన (23), ప్రతీక రావల్ (37) ఫర్వాలేదనిపించినా, మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (9) తన వైఫల్యాన్ని కొనసాగించగా.. జెమీమా రోడ్రిగ్స్ (0) మరో డకౌట్‌ను నమోదు చేసింది. ఈ క్లిష్ట సమయంలో రిచా ఘోష్ (Richa Ghosh) 77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు 94 పరుగులతో అసాధారణ పోరాటం చేసి జట్టును ఆదుకుంది. ఆమె త్రుటిలో సెంచరీ అవకాశం కోల్పోయినప్పటికీ.. తన మెరుపు బ్యాటింగ్‌తో భారత్ స్కోరును మెరుగైన స్థితికి చేర్చింది. రిచా, అమన్‌జోత్ కౌర్‌తో కలిసి ఏడో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆ తర్వాత స్నేహ్ రాణా (Sneh Rana) 24 బంతుల్లో 33 పరుగులతో కలిసి ఎనిమిదో వికెట్‌కు కేవలం 53 బంతుల్లోనే 88 పరుగుల పటిష్ట భాగస్వామ్యం నెలకొల్పి స్కోరును 241కి చేర్చింది. ఈ ఇన్నింగ్స్‌తో, మహిళల ప్రపంచకప్ చరిత్రలో 8వ స్థానంలో లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (94) చేసిన రికార్డును రిచా ఘోష్ తన ఖాతాలో వేసుకుంది. చివరి 10 ఓవర్లలో భారత్ 98 పరుగులు సాధించడం విశేషం. ఇక బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా తరపున క్లో ట్రయాన్ (Chloe Tryon) 3, మరిజానే కాప్ (Marizanne Kapp), నాడిన్ డి క్లెర్క్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
Erra Cheera Movie: హార్ట్ పేషెంట్స్ మా సినిమానికి చూడటానికి వచ్చినప్పుడు జాగ్రత్త!
ఇక 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు కూడా ఆరంభంలో తడబడింది. 81 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది. కెప్టెన్ లారా వోల్వర్డ్ట్ (Laura Wolvaardt) (111 బంతుల్లో 70; 8 ఫోర్లు) ఒక ఎండ్‌లో నిలబడి కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఆమె క్లో ట్రయాన్ (49)తో కలిసి ఆరో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే, 142 పరుగుల వద్ద లారా వోల్వర్డ్ట్ ఔటైన తర్వాత దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ నాడిన్ డి క్లెర్క్ 54 బంతుల్లో 84 నాటౌట్ మెరుపు బ్యాటింగ్‌తో భారత బౌలర్లపై విరుచుకుపడింది. చివరి వరకు అద్భుత పోరాటం చేసి, 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించింది. డి క్లెర్క్, క్లో ట్రయాన్ ఏడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో నాడిన్ డి క్లెర్క్, ఆయాబొంగ ఖాకా (Ayabonga Khaka)తో కలిసి 8వ వికెట్‌కు అవసరమైన పరుగులు సులభంగా రాబట్టింది. డి క్లెర్క్ ఆల్-రౌండర్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ (Kranti Gaud) 2, స్నేహ్ రాణా 2 వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన (Smriti Mandhana) 23 పరుగులు చేసింది. 2025లో వన్డేలలో ఆమె మొత్తం పరుగులు 982కు చేరుకున్నాయి. దీంతో ఒకే క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక వన్డే పరుగులు చేసిన బ్యాటర్‌గా బెలిండా క్లార్క్ (Belinda Clark) రికార్డును మంధాన అధిగమించింది.
