ISRO LVM3 : బహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు శ్రీహరి కోట నుంచి LVM3-M5 రాకెట్‌ను సక్సెస్‌ఫుల్‌గా నింగిలోకి ప్రయోగించారు. ఆదివారం సాయంత్రం 5.26 నిమిషాలకు రాకెట్ నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిరింది. ఈ LVM3-M5 రాకెట్ CMS-3 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. 16 నిమిషాల 09 సెకన్లలోనే CMS-3 ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించింది. కాగా, ఇస్రో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో CMS-3 అతిపెద్దది కావటం విశేషం.
ఈ ఉపగ్రహం బరువు 4,410 కిలోలు. CMS-3 ఉపగ్రహం భారత్‌కు సమాచార సేవలు అందించనుంది. ఈ ఉపగ్రహం ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడడంతోపాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఇక, కౌంట్ డౌన్ ప్రారంభానికి ముందు ఇస్రో చైర్మన్ వీ నారాయణ, షార్ డైరెక్టర్ పద్మ కుమార్‌లు రాకెట్ నమూనాలకు తిరుమల శ్రీవారి ఆలయంలో.. శ్రీకాళహస్తిలోని స్వామి వారి సన్నిధిలో.. సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ISRO LVM3 – ఇస్రో శాస్త్రవేత్తలకి సీఎం చంద్రబాబు అభినందనలు
సీఎంఎస్-03 ప్రయోగం విజయవంతంపై ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడులు అభినందనలు తెలిపారు. బాహుబలి రాకెట్ LVM3 (ISRO LVM3) ప్రావీణ్యం చాటిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. LVM3-M5 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం, మన దేశానికి గర్వకారణమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఇప్పటి వరకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టిన అన్ని ప్రయోగాలు విజయవంతమయ్యాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ పెట్టారు.
‘భారతదేశపు అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్-03ను దాని ఉద్దేశించిన కక్ష్యలోకి ఖచ్చితత్వంతో మోసుకెళ్లిన LVM3M5 ‘బాహుబలి’ ప్రయోగం సందర్భంగా ఇస్రో బృందానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విజయం అంతరిక్ష సాంకేతికతలో భారతదేశ బలాన్ని, కమ్యూనికేషన్ రంగంలో మంచి మార్పుని తీసుకువస్తుంది. ఇది మన దేశానికి, ఇస్రోకి గర్వకారణం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
విజ్ఞాన శాస్త్రంలో భారత్ ప్రపంచాన్ని ముందుండి నడిపిస్తోంది – మంత్రి అచ్చెన్నాయుడు
విజ్ఞాన శాస్త్రంలో భారత్ ప్రపంచాన్ని ముందుండి నడిపిస్తోందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగంతో భారత్ కొత్త శకంలోకి దూసుకెళ్లిందని చెప్పుకొచ్చారు. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే శాస్త్ర శక్తి మన ఇస్రోదేనని, దేశ గర్వాన్ని మళ్లీ రెట్టింపు చేసిందని తెలిపారు. ఇంటర్నెట్ కమ్యూనికేషన్ సేవలకు గేమ్‌చేంజర్‌గా సీఎంఎస్-03 ఉండనుందని వెల్లడించారు మంత్రి అచ్చెన్నాయుడు.
4,410 కిలోల భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపిన ఇస్రో ప్రతిభకు సెల్యూట్ అని పేర్కొన్నారు. భారత్‌ను అంతరిక్ష శక్తిగా నిలుపుతున్న శాస్త్రవేత్తలు దేశ రత్నాలని ఉద్ఘాటించారు. ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్ భారత ప్రతిభకు బ్రాండ్ అంబాసిడర్, సమాచార విప్లవానికి నూతన అడుగు ఈ ఉపగ్రహమని చెప్పుకొచ్చారు. సముద్ర భద్రత, జలాంతర్గాముల కమ్యూనికేషన్‌లో సీఎంఎస్-03 కీలకమని తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్ అగ్రగామి అవుతోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Also Read : Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్
The post ISRO LVM3: ఇస్రో బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
