Jana Nayagan |తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు అడ్డంకులు తొలగడం లేదు. ఇప్పటికే పలు కారణాలతో వాయిదా పడుతున్న ఈ మూవీ రిలీజ్ తాజాగా మద్రాస్ హైకోర్టు తీర్పుతో మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్ మంజూరు చేయాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు డివిజినల్ బెంచ్ రద్దు చేసింది. సినిమా సెన్సార్ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కు మరింత సమయం ఇవ్వాల్సిందని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా, ఈ సినిమాను మళ్లీ సెన్సార్ రివ్యూ కమిటీకి రిఫర్ చేస్తూ కీలక తీర్పు వెలువరించింది.
‘జన నాయగన్’ సినిమాలో కొన్ని సన్నివేశాలు విదేశీ శక్తులు భారత్‌లో మతపరమైన విధ్వంసాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఇవి దేశంలోని మత సామరస్యానికి విఘాతం కలిగించే అవకాశముందని హైకోర్టు డివిజినల్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సినిమా తిరిగి రివ్యూ కమిటీకి వెళ్లడం తప్పుకాదని కోర్టు పేర్కొంది. గతంలో ‘U/A’ సర్టిఫికేట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలు సరైనవి కాదని స్పష్టం చేస్తూ వాటిని తోసిపుచ్చింది. అంతేకాదు, ఈ సినిమాలో భారత సైన్యానికి సంబంధించిన కీలక సన్నివేశాలు ఉన్నాయని, అయితే మొదట సినిమాను పరిశీలించిన కమిటీలో ఆ అంశాలపై సరైన అవగాహన ఉన్న నిపుణులు లేరని కోర్టు వ్యాఖ్యానించింది.
ఈ కారణంగా ఈసారి ఆర్మీ అధికారుల సమక్షంలో రివ్యూ కమిటీ సినిమా వీక్షించి సర్టిఫికేట్ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సెంట్రల్ బోర్డ్ నుంచి అధికారికంగా సర్టిఫికేట్ వచ్చేంత వరకు సినిమా విడుదల చేయరాదని కూడా కోర్టు తేల్చి చెప్పింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జన నాయగన్’ మూవీ రిలీజ్ మరింత ఆలస్యం కానున్నట్లు స్పష్టమవుతోంది. విజయ్ సినిమా రోజు రోజుకి ఇలా వాయిదా పడుతుండడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.
