Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Jubilee Hills | ఈసీ పెద్దలూ చూస్తున్నారా.. ? కాంగ్రెస్‌ అభ్యర్థి తమ్ముడికి 3 ఓట్లు..!

Ai generated article, credit to orginal website, October 15, 2025

జూబ్లీహిల్స్‌లో బోగస్‌ ఓట్ల వెల్లువ.. 35వేల ఓట్ల పెరుగుదల
ఒకే ఇంటి నంబర్‌తో రెండు ఓట్లు
ఇంటి నంబర్లే తప్ప… 287 ఇండ్లు లేవు
ఒకే ఇంటి నంబర్‌తో 43 ఓట్ల నమోదు
ముగ్గురున్నా 23.. ఇల్లే లేకున్నా 42 ఓట్లు
బయట వ్యక్తులకు జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ సర్కారు అరాచకాలు
ఈసీ తుది ఓటరు జాబితాలోనే అనేక కుట్రలు
ఆధారాలతో సహా బయటపెట్టిన కేటీఆర్‌
దొంగ ఓట్లపై ఈసీ స్పందించాలని డిమాండ్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 14(నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌కుమార్‌యాదవ్‌ సొంత తమ్ముడు వెంకట్‌ ప్రవీణ్‌కుమార్‌కు మూడు ఓట్లు ఉన్నాయని రెండు జూబ్లీహిల్స్‌లో, ఒకటి రాజేంద్రనగర్‌లో ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. WKH4226320 కార్డు నంబర్‌తో ఒకటి, WKH3126018 నంబర్‌తో రెండోది, WPK4555355 నంబర్‌తో ఒకటి కలిపి మొత్తంగా మూడు ఓటర్‌ కార్డులు ఉన్నట్టు చెప్పారు. జూబ్లీహిల్స్‌లోని రెండు కార్డుల్లో ఆయన పేరు, తండ్రి పేరు ఒకటే కానీ, ఇంటి నంబర్లు వేరుగా ఉన్నాయని తెలిపారు. ఒకదాంట్లో 8-3-229/2/4 ఉండగా, మరో ఐడీ కార్డులో 8-3-229/S/3/5గా నమోదు అయినట్టు చెప్పారు. ఒకదాంట్లో ఇంటి అడ్రస్‌ అని పేర్కొనగా, మరో కార్డులో ఆఫీస్‌ అడ్రస్‌గా పేర్కొన్నారని తెలిపారు. ఇంతకంటే అరాచకం ఎక్కడైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. ఇలాంటి ఓటరు జాబితాతో ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ ఎలక్షన్‌ అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఎలక్షన్‌ కమిషన్‌ ముందుకు వెళ్తున్నాయని విమర్శించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌ ఓట్‌ చోరీపై మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ తొక్కుతున్న అడ్డదారులను సాక్ష్యాలతో ప్రజల ముందు పెడతామని చెప్పారు. అయితే, కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని తేల్చి చెప్పారు.
రెండేళ్లలో 23 వేల ఓట్లు ఎలా పెరిగినయ్‌?
2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో సుమారు 3.75 లక్షల ఓట్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించిందని, కానీ ఇప్పుడు ఇక్కడ 3.98 లక్షల ఓట్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం తాజాగా ఓటరు జాబితాను విడుదల చేసిందని కేటీఆర్‌ తెలిపారు. అంటే 23 వేల ఓట్లు పెరిగాయని ఎన్నికల సంఘం చెప్తున్నదని, శాసనసభ ఎన్నికలు జరిగి రెండేళ్లు కూడా పూర్తికాకముందే 23 వేల ఓట్లు ఎలా పెరుగుతాయని ప్రశ్నించారు. అలాగే, పాత జాబితాలో 12 వేల ఓట్లు తొలగించామని చెప్తున్నారని, అవి తొలగించినా 23 వేల ఓట్లు పెరిగాయంటే.. మొత్తంగా 35 వేల ఓట్లు పెరిగినట్టని వివరించారు. ఈ జాబితా పట్టుకుని ఇంటింటికి వెళ్లి విచారణ జరిపితే విస్తుపోయే వాస్తవాలు, అక్రమాలు బయటపడినట్టు తెలిపారు.
ఓటర్‌ కార్డులు ఆయనెలా పంపిణీ చేస్తారు?
కాంగ్రెస్‌ అభ్యర్థి బహిరంగంగా ఓటరు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని కేటీఆర్‌ తెలిపారు. అసలు ఓటర్‌ కార్డులు పంపిణీ చేసేందుకు ఆయనెవరని ప్రశ్నించారు. అది ఎన్నికల కమిషన్‌ పని అని, ఆయనెందుకు చేశారని నిలదీశారు. ఈ కార్యక్రమంలో వెయ్యికి పైగా ఓటర్‌ ఐడీ కార్డులు పంపిణీ చేశారని ఆరోపించారు. మైనర్లకు కూడా కార్డులు పంపిణీ చేశారన్నారు. ఓటర్‌ ఐడీ కార్డులు పంపిణీ చేసేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థికి ఆ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయన పంపిణీ చేసినవి ఫేక్‌ ఐడీ కార్డులని ఎన్నికల అధికారులు తేల్చారని పేర్కొన్నారు. ఆయనపై కేసు కూడా నమోదైందని తెలిపారు. ‘నకిలీ ఐడీ కార్డుల పంపిణీ అనేది తీవ్రమైన నేరం. దొంగ ఓట్లు నేరం అయితే.. దొంగ కార్డులు పంపిణీ చేయడం ఇంకా నేరం’ అని పేర్కొన్నారు.
ఒకే ఇంటి నంబర్‌తో 43 ఓట్లు
ఓట్లు భారీగా పెరగడంపై అనుమానం వచ్చి తమ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి విచారణ చేపట్టినట్టు కేటీఆర్‌ తెలిపారు. వీళ్లకు ఫేక్‌ ఐడీ కార్డులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశంపై లోతుగా విచారణ చేశామని, తమ విచారణలో విస్తుపోయే వాస్తవాలు, అక్రమాలు బయటపడినట్టు తెలిపారు. బూత్‌ లెవల్‌ అధికారులతో కలిసి కాంగ్రెస్‌ నేతలు ఈ అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని సంస్కృతి అవెన్యూ అపార్ట్‌మెంట్‌లో ఒకే ఇంటి నంబర్‌తో 43 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఈ జాబితా తీసుకొని తమ పార్టీ కార్యకర్తలు ఆ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి ఈ జాబితా చూపించి మీకు ఎవరైనా తెలుసా అని ఆరా తీస్తే, అసలు ఓటరు జాబితాలోని వాళ్లలో ఒక్కరు కూడా అక్కడ లేరని తేలిందని చెప్పారు. అక్కడి వాళ్లను విచారిస్తే జాబితాలో ఉన్నవాళ్లెవరో తెలియదన్నారని వివరించారు.

కాంగ్రెస్‌ లీడర్‌ ఇంట్లో 32 నకిలీ ఓట్లు
బూత్‌ నంబర్‌ 118లోని ఓ కాంగ్రెస్‌ లీడర్‌ ఇంట్లో ఏకంగా 32 నకిలీ ఓట్లు ఉన్నట్టు కేటీఆర్‌ ఆరోపించారు. ఎక్కడో ఉన్న వ్యక్తుల పేర్లను జూబ్లీహిల్స్‌ ఓటరు జాబితాలో దొంగతనంగా చేర్చారని మండిపడ్డారు. ఇలా చేర్చిన వారందరికీ రెండు ఓట్లు ఉన్నట్టు తెలిపారు. పాత ఓటు అలాగే ఉండగా మళ్లీ కొత్తగా చేర్చారని ఆరోపించారు.
ఒక్క వ్యక్తి రెండు ఓట్లు.. ఇలా 2 వేల ఓట్లు
ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉన్న ఘటనలు జూబ్లీహిల్స్‌ ఓటరు జాబితాలో కోకోల్లలుగా ఉన్నాయని కేటీఆర్‌ తెలిపారు. ఇలాంటివి దాదాపు 2 వేల ఓట్లు ఉన్నాయని వివరించారు. ఇవి కేవలం తమ సొంత విచారణలో తెలినవి మాత్రమేనని, ఇంకా ఎక్కువే ఉండొచ్చని తెలిపారు.
సిరిసిల్ల వ్యక్తికి జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు
తన సొంత నియోజకవర్గం సిరిసిల్లకు చెందిన గోగూరి శ్రీనివాస్‌రెడ్డి తండ్రి ఎల్లారెడ్డి ఓటు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ జాబితాలో దర్శనమిచ్చిందని కేటీఆర్‌ తెలిపారు. ఆయన ఓటరు కార్డు నంబర్‌ ఏటీఎం 0460691. ఆయన పేరు కూడా సెప్టెంబర్‌ 2న కొత్తగా నమోదైనట్టు తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డిని కలిసిన తమ టీం ‘మీరు జూబ్లీహిల్స్‌లో ఓటు నమోదు చేసుకున్నారా’ అని అడగ్గా అసలు ఆ విషయమే తనకు తెలియదని చెప్పారని కేటీఆర్‌ తెలిపారు. ఆయన పేరుపై వేరేవాళ్లు దొంగ ఓటు వేసేందుకు దీనిని సృష్టించరాని ఆరోపించారు.
ఇల్లే లేదు.. కానీ 42 ఓట్లు
జూబ్లీహిల్స్‌ ఓటరు జాబితా అరాచకాలపై తమ పార్టీ చేసిన ఇంటింటి సర్వేలో అనేక అరాచకాలు వెలుగు చూశాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ సర్వేలో అక్కడ ఇండ్లు లేవుకానీ ఆ ఇంటి పేరుపై పదుల సంఖ్యలో ఓట్లు ఉన్నట్టు తెలిపారు. 8-3-229/D/43/1 ఈ ఇంటి అడ్రస్‌లో 42 ఓట్లు ఉన్నాయని ఓటర్‌ లిస్ట్‌లోపెట్టారని, కానీ ఆ ఇంటి కోసం వెతికితే అసలు అక్కడ ఆ ఇల్లే లేదని పేర్కొన్నారు. ఇలాంటి 287 ఇల్లు లేని ఇంటి నంబర్లు ఉన్నాయని వివరించారు. ఇలాంటి ఇండ్లలో 12,045 ఓట్లు ఉన్నాయని, ఇవన్నీ సెప్టెంబర్‌ 2న జత చేశారని తెలిపారు.

1. మిరియాల అశోక్‌ తండ్రి మిరియాల సత్తయ్య అనే వ్యక్తి దేవరకొండ నివాసి. ఆయనకు 2024 ఓటరు జాబితా ప్రకారం దేవరకొండలో ఓటు ఉంది. ఆయన సెప్టెంబర్‌ 2న ఆయన పేరును తాజాగా జూబ్లీహిల్స్‌ ఓటరు జాబితాలో చేర్చారు. ఆయనకు దేవరకొండలో, జూబ్లీహిల్స్‌లో రెండుచోట్లా ఓట్లు ఉన్నాయి.
2. వెంకటేశ్‌ బిక్కిన అనే వ్యక్తికి ఒక ఓటు ఖైరతాబాద్‌లో ఉండగా మరో ఓటు జూబ్లీహిల్స్‌లో ఉంది. ఆయనది కూడా కొత్తగానే జాబితాలో చేర్చారు.
3. రమేశ్‌ అనే వ్యక్తికి గతంలో గద్వాల్‌లో ఓటు హక్కు ఉండగా ప్రస్తుతం ఆయన పేరు జూబ్లీహిల్స్‌ ఓటరు జాబితాలో చేర్చారు.
ఆయనకు ఇప్పుడు గద్వాల్‌లోను, జూబ్లీహిల్స్‌లోనూ ఓటు ఉంది.
బీహార్‌లో ఓట్‌ చోరీ జరిగిందని రాహుల్‌గాంధీ అంటున్నారు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే చేస్తున్నది. కాంగ్రెస్‌ వాళ్లే బూత్‌ లెవల్‌ అధికారులతో కలిసి ఈ ఓట్లు సృష్టించారని అనిపిస్తున్నది. బీహార్‌లో బీజేపీ చేస్తున్నదే రాష్ట్రంలో కాంగ్రెస్‌ చేస్తున్నది.
-కేటీఆర్‌
పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో కేటీఆర్‌ వెల్లడించిన సంచలన విషయాలు
వాళ్లలో ఎవరూ తెలియదు జాబితాలో ఉన్నవాళ్లలో ఎవరూ నాకు తెలియదు. ఏడాదిన్నర క్రితం కొనుక్కుని ఇక్కడికి వచ్చినం. అంతకుముందు ఎవరూ ఉన్నట్టు మాకు తెలియదు. అందరూ నాన్‌లోకల్‌ నుంచి వచ్చిన వాళ్లమే. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లమైతే కాదు. నిర్మాణంలో ఉన్నప్పుడు కూడా చూశాం. ఈ ఓటర్‌ జాబితాలో ఉన్నవాళ్లు ఎవరికీ తెలియదు.
-అపార్ట్‌మెంట్‌ నివాసి
ఓనరే పరేషాన్‌లో ఉన్నరు
ఇక్కడ కేబుల్‌ ఆపరేటర్‌గా 25 ఏండ్లుగా పనిచేస్తున్నాను. ఈ ఇంటి యజమాని నారాయణ 15 ఏండ్ల కిత్రం వచ్చి 60 గజాల స్థలం కొనుగోలు చేశారు. ఇన్ని ఓట్లు వచ్చినట్టు తెలిసి ఆయనే పరేషాన్‌లో ఉన్నారు. ఈ ఓట్లు ఎట్లా వచ్చాయని ఆయనే అడుగుతున్నాడు. అసలు ఈ ఓట్లు వచ్చినట్టు ఆయనకే తెలియదు.
-కేబుల్‌ ఆపరేటర్‌
యజమానికి తెలియకుండానే 23 ఓట్లు
బూత్‌ నంబర్‌ 125లోని ఓ ఇంట్లో ఒకే ఇంటి నంబర్‌తో 23 ఓట్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం జాబితా ఇచ్చింది. అయితే, ఆ ఇంటి యజమాని నారాయణకు తెలియకుండానే 23 ఓట్లను నమోదు చేశారు. తన ఇంట్లో 23 మంది ఉన్నట్టు తనకే తెలియదని ఆయన చెప్పారు. కానీ ఎన్నికల కమిషన్‌ మాత్రం ఆ ఇంట్లో 23 మంది ఉన్నట్టు చెప్తున్నది.
వారెవరో తెలియదంటున్నారు
ఓటరు జాబితాలో నారాయణ ఇంటి నంబర్‌పై 23 ఉన్నట్టు గమనించి ఓనర్‌తో మాట్లాడితే ఆయన తనతోపాటు మరో ఇద్దరు రెంట్‌కు ఉంటున్నట్టు చెప్పారు. అంటే మొత్తం మూడు ఓట్లు ఉండాలి. మరి ఆ 23 మంది గురించి అడిగితే వాళ్లెవరోతెలియదని, తాను వారి ముఖం కూడా చూడలేదన్నారు.
-పొరుగింటి వ్యక్తి
అది 100% దొంగ ఓటు
నా పేరు గోగూరి శ్రీనివాస్‌రెడ్డి. తండ్రి ఎల్లారెడ్డి. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్నపేట గ్రామం. జూబ్లీహిల్స్‌ దొంగ ఓట్లలో నా పేరు వచ్చిందని టీవీలో చూసి షాక్‌ అయ్యాను. నేను పుట్టి పెరిగింది రాజన్నపేటలోనే. నేను వ్యవసాయం చేసుకుంటూ రాజన్నపేటలోనే నివసిస్తున్నాను. ఇది 100శాతం దొంగ ఓటు.
ఒకే వ్యక్తి.. ఒకే అడ్రస్‌.. కానీ మూడు ఓటరు కార్డులు
జూబ్లీహిల్స్‌ ఓటరు జాబితాలో అరాచకాలు, దుర్మార్గాలు ఉన్నాయని కేటీఆర్‌ విమర్శించారు. ఇందులో భాగంగానే ఒకే వ్యక్తి ఒకే అడ్రస్‌తో మూడు వేర్వేరు ఓటరు కార్డులు పొందినట్టు తెలిపారు. ఒకే మనిషి, ఒకే పేరు, ఒకే తండ్రి, ఒకే అండ్రస్‌ కానీ మూడు వేర్వేరు కార్డులు ఉన్నాయని తెలిపారు.
1. కోవూరి కార్తీక్‌ తండ్రి కోవూరి నాగన్న అనే వ్యక్తికి మూడు ఓటర్‌ కార్డులున్నాయి. ఈ మూడు కార్డులపై కూడా ఒకే ఇంటి నంబర్‌ 8-3-229/D/75/D/H ఉంది. అదే విధంగా ఒకే రకమైన ఫోటో ఉంది. కానీ మూడు వేర్వేరు ఓటరు కార్డులు ఉన్నాయి. WKH4407896, WKH4450409, WKH4455168 ఓటరు కార్డుల నెంబర్లతో మూడు కార్డులు ఉన్నాయి. నిజానికి కార్తీక్‌ ఉండేది అమెరికాలో.
2. మాధురి గూడెటి (భర్త హేమంత్‌ కుమార్‌ గూడెటి) అనే మహిళ పేరుతో రెండు ఓటరు కార్డులు ఉన్నాయి. WKH3322039, WKH2917706 ఎఫిక్‌ కార్డు నంబర్లతో రెండు ఓటరు కార్డులు ఉన్నాయి. రెండు కార్డులపై కూడా అమ్మాయి పేరు, భర్త పేరు, ఇంటి అడ్రస్‌ ఒకే విధంగా ఉండగా కేవలం ఫోటో మాత్రం వేర్వేరుగా ఉన్నాయి.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • తీర‌నున్న ఓరుగల్లు ఎయిర్ పోర్టు క‌ల
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు షాక్
  • టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ ఎంట్రీపై ఉత్కంఠ‌
  • వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రులు
  • అధికారంలోకి రావాలంటే జ‌గ‌న్ లో మార్పు రావాలి

Recent Comments

No comments to show.

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes