Justice Suryakant : సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 24వ తేదీన జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న బీఆర్ గవాయ్ నవంబర్ 23వ తేదీన రిటైర్ కానున్నారు.
Justice Suryakant – సుప్రీంకోర్టులో సీనియర్
ఇక సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) ఉన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్‌ను నియమించాలంటూ కేంద్ర న్యాయశాఖకు జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సిఫార్సు చేసిన కొన్ని గంటల్లోనే జస్టిస్ సూర్యకాంత్ నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ విషయాన్నికేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.
శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సూర్యకాంత్‌కు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలను వినియోగించి.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను రాష్ట్రపతి నియమించారని తెలిపారు. 2025, నవంబర్ 24వ తేదీన ఆయన ఈ బాధ్యతలు చేపడతారని వివరించారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ సూర్యకాంత్‌కు ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందలు, శుభాకాంక్షలు అని కేంద్ర మంత్రి అర్జన్ రామ్ మేఘవాల్ తెలిపారు.
హర్యానాకు చెందిన జస్టిస్ సూర్యకాంత్.. గతంలో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. అంతకు ముందు పంజాబ్, హర్యానా హైకోర్టు జడ్జిగా పని చేశారు. ఆ తర్వాత 2019 మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు. హర్యానా నుంచి ఈ పదవిని చేపట్టనున్న తొలి వ్యక్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఖ్యాతికెక్కనున్నారు.
ఇక న్యాయపరమైన అంశాలు, సామాజిక న్యాయం, పాలన వ్యవహారాలు, పర్యావరణ సమస్యలు తదితర అంశాలపై ఆయనకు బలమైన పట్టుంది. అలాగే అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో ఉండి.. కీలక తీర్పులు సైతం వెలువరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ 14 నెలలపాటు కొనసాగనున్నారు. ఈ సమయంలో ఎన్నికల సంస్కరణలు, క్రిమినల్ జస్టిస్, డిజిటల్ ప్రైవసీకి సంబంధించిన అంశాలు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Also Read : Rabri Devi: కుమారుల పోటీపై రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు
The post Justice Suryakant: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
