Kapil Sibal | న్యూఢిల్లీ, జనవరి 18: చిన్న పార్టీలు ఎట్టిపరిస్థితుల్లో బీజేపీతో జట్టు కట్టవద్దని రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారం దక్కించుకోవడానికి తొలుత బీజేపీ వారితో పొత్తు పెట్టుకుంటుందని, తీరా అవసరం తీరిన తర్వాత వారిని పక్కన పడేయడం కాషాయ పార్టీ వ్యూహమని పేర్కొన్నారు. అధికారం లేని చోట, బలహీనంగా ఉన్న రాష్ర్టాల్లో అక్కడ అధికారంలో ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ వ్యూహమని, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అణగదొక్కేసి అందలమెక్కుతుందని అన్నారు.
‘కమలం పార్టీతో పొత్తుపెట్టుకున్నారా? మీ పని ముగిసినట్టే’ అని హెచ్చరించారు. ఈ వ్యూహాన్ని బీజేపీ బీహార్‌లో విజయవంతంగా అమలు చేసిందని, అక్కడ తొలుత జేడీ(యూ)తో పొత్తు పెట్టుకుని తర్వాత రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఆవిర్భవించిందని అన్నారు. గతంలో అది హర్యానాలో కూడా పనిచేసిందని, అక్కడ ఐఎన్‌ఎల్‌డీకి మద్దతుగా పనిచేసి తర్వాత దానిని పక్కకు తోసిందని గుర్తు చేశారు. తాజాగా బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ఆయన ప్రస్తావిస్తూ తొలుత శివసేనను కమలం పార్టీ చీల్చిందని, అనంతరం ఏక్‌నాథ్ వర్గంతో పొత్తుపెట్టుకుని ఆధికారాన్ని పొందిందని కపిల్ సిబల్ తెలిపారు.
