కార్తీక కృష్ణ చతుర్థి నాడు మహిళలు ‘కర్వా చౌత్’ ఉపవాసం పాటిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 10న కర్వా చౌత్ వస్తోంది. దాంతో ఉత్తర భారతదేశంలో పండుగ శోభ ఉట్టిపడుతోంది. మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం చేసే ఈ పండుగను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఉత్తర భారతదేశంలో మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. వివాహిత మహిళలు రాత్రి చంద్రుడి పూజ అనంతరం ఉపవాసం విరమిస్తారు. రేపే కర్వా చౌత్ కాబట్టి.. ఉపవాసం, పూజకు శుభ సమయం ఏంటో తెలుసుకుందాం.
కర్వా చౌత్ రోజున వివాహిత మహిళలు ఉదయం సర్గి తిన్న తర్వాత ఉపవాసం ఉంటారు. మధ్యాహ్నం పూజ తర్వాత కర్వా చౌత్ కథను వింటారు. కథ వినడంతోనే ఉపవాసం అధికారికంగా ప్రారంభమవుతుంది. సాయంత్రం శివుడు, పార్వతి దేవి, గణేశుడిని పూజించిన తర్వాత కర్వా చౌత్ మాతను పూజిస్తారు. పగలంతా నిష్టగా ఉపవాసం పాటించిన మహిళలు సాయంత్రం చంద్రుని దర్శనం కోసం ఎదురుచూస్తుంటారు. సాయంత్రం చంద్రోదయ సమయంలో చంద్రుడికి అర్ఘ్యాన్ని సమర్పిస్తారు. జల్లెడ ద్వారా చంద్రుడిని చూస్తారు. అదే జల్లెడ ద్వారా తమ భర్త ముఖాన్ని చూసి.. అతని చేతిలో నుండి నీరు తీసుకొని ఉపవాసం విరమిస్తారు. కర్వా చౌత్ రోజున భర్తకు తన భార్యలకు ప్రత్యేక బహుమతులు ఇచ్చి గౌరవించడం సాంప్రదాయంగా వస్తోంది.
Also Read: Smriti Mandhana: చేసింది 23 పరుగులే.. అయినా చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన!
ఈ సంవత్సరం కర్వా చౌత్ ఉపవాసం వ్యవధి సుమారు 14 గంటలు. ఉపవాసం ఉదయం 6:20 గంటలకు ప్రారంభమై.. రాత్రి 8:14 గంటలకు ముగుస్తుంది. రాత్రి 8:15 గంటలకు చంద్రుడిని చూసిన తర్వాత ఉపవాసాన్ని విరమించవచ్చు. కర్వా చౌత్ నాడు అత్త తన కోడలికి సర్గి ఇస్తారు. ఉపవాసానికి శరీరానికి తగినంత శక్తిని అందించడానికి ఇందులో పోషకమైన వంటకాలు ఉంటాయి. కర్వా చౌత్ నాడు సర్గి తినడానికి శుభ సమయం ఉదయం 4:40 నుండి 5:30 వరకు ఉంది.
కర్వా చౌత్ ఉపవాసం పాటించే స్త్రీలు ఆహారం, పానీయాలకు దూరంగా ఉండాలి. ఉపవాసం నీరు కూడా తాగకుండా చేయాలి. ఈ రోజున నలుపు, తెలుపు దుస్తులు ధరించవద్దు. కోపం, అహంకారాన్ని ప్రదర్శించవద్దు. పగటిపూట అస్సలు నిద్రపోవద్దు. మీ వివాహ లేదా అలంకరణ వస్తువులను ఎవరికీ ఇవ్వకండి. కత్తెర, కత్తులు, సూదులు లాంటి పదునైన పరికరాలను ఉపయోగించవద్దు. కర్వా చౌత్ కేవలం వ్రతం మాత్రమే కాదు.. భార్యాభర్తల మధ్య చెక్కుచెదరని విశ్వాసం, ప్రేమకు ప్రతీకగా నిలిచే పండుగ.
