అగ్ర రాజ్యం అమెరికాలో ప్రస్తుతం షట్‌డౌన్ నడుస్తోంది. జీతాలు రాక ఉద్యోగులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో బాధ్యతగా మెలగాల్సిన ఎఫ్‌బీఐ డైరెక్టర్ గాడి తప్పారు. అత్యున్నత పదవిలో ఉండి మాదిరిగా ఉండాల్సిన కాష్ పటేల్.. ప్రియురాలి కోసం అధికారిక జెట్‌లో షికార్లు చేశారు. ప్రస్తుతం ఈ అంశం పెను దుమారం రేపుతోంది. సోషల్ మీడియా వేదికగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ (45), 26 ఏళ్ల అలెక్సిస్ విల్కిన్స్ ఇద్దరూ ప్రేమికులు. పెన్సిల్వేనియాలో రెజ్లింగ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ సంగీత కచేరీ ఉంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్ కాష్ పటేల్ అధికారిక జెట్‌ను ఉపయోగించారు. వర్జీనియా నుంచి పెన్సిల్వేనియాకు 40 నిమిషాల విమాన ప్రయాణం చేసి ఈవెంట్లో పాల్గొన్నారు. ఇందుకోసం 60 మిలియన్ల వరకు ఖర్చైంది.
ప్రస్తుతం ఈ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఎఫ్‌బీఐ మాజీ ఏజెంట్ కైల్ సెరాఫిన్ కీలక ఆరోపణలు చేశారు. ప్రియురాలి కోసం కాష్ పటేల్ అధికారిక జెట్‌ను ఉపయోగించారని.. దేశమంతా షట్డౌన్లో ఉండి.. జీతాలు రాక ఇబ్బంది పడుతుంటే.. కాష్ పటేల్ మాత్రం మన డబ్బులతో ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నాడంటూ విమర్శలు ఎక్కిపెట్టాడు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
వాస్తవంగా ఉన్నత పదవులో ఉన్నవాళ్లు అనధికారిక కార్యక్రమాలకు ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలు ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగిస్తే.. అందుకు అయిన ఖర్చు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే కాష్ పటేల్ ఇలా అనధికారిక కార్యక్రమాలకు హాజరుకావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అనేక ప్రైవేటు కార్యక్రమాలకు అధికారిక జెట్‌ను ఉపయోగించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.
అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
అలెక్సిస్ విల్కిన్స్ ఒక సింగర్, రచయిత్రి, వ్యాఖ్యాత, ప్రెస్ సెక్రటరీగా కూడా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. స్విట్జర్లాండ్, ఇంగ్లండ్‌లో బాల్యాన్ని గడిపారు బెల్మాంట్ విశ్వవిద్యాలయంలో వ్యాపారం, రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పొందారు. 2022లో ఒక కార్యక్రమంలో కాష్ పటేల్-విల్కిన్స్ కలుసుకున్నారు. 2023 నుంచి ఇద్దరూ డేటింగ్లో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu: పెంపుడు జంతువులపై కొత్త ఆంక్షలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే..!
