Kashibugga : శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిలాట జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందగా… 16 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంలోని జెమ్స్ ఆసుపత్రికి తరలించారు. కార్తీక మాసం అందులోనూ ఏకాదశి కావడంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో స్వామి వారి దర్శనానికి భక్తులో పోటీ పడి… ఒకరినొకరు తోసుకోవడంతో… క్యూ లైన్ కోసం ఏర్పాటు చేసిన రెయిలింగ్ ఊడిపోయి… తొక్కిసలాటకు దారి తీసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… సహాయక చర్యలు ప్రారంభించారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Kashibugga – కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం ప్రకటన
కాశీబుగ్గ (Kashibugga) ఆలయంలో తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి 15 వేల మంది భక్తులు వచ్చారని అధికారులు వెల్లడించారు. రెయిలింగ్ ఊడి పడటంతో తొక్కిసలాట చోటు చేసుకుందని, ఘటనాస్థలంలో ఏడుగురు, పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఈ ఘటనలో 16 మందికి గాయాలు కాగా.. క్షతగాత్రులకు పలాస ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఆలయాల వద్ద భక్తుల రద్దీని క్రమబద్ధీకరించాలి – తొక్కిసలాట ఘటనపై పవన్ కల్యాణ్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని (Kashibugga) వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 9 మంది భక్తులు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. వారిలో చిన్నారి కూడా ఉండటం తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఆలయంలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపడతాం. ఆధ్యాత్మికంగా విశిష్టమైన రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల వద్ద యంత్రాంగం భక్తుల రద్దీని క్రమబద్ధీకరించాలి. ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలి. క్యూలైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి. రద్దీ ఉండే ఆలయాల్లో పోలీసు బందోబస్తు, మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలి’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు సంతాపం
పలాస-కాశీబుగ్గ (Kashibugga) మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిలాటపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఈ మేరకు తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ ద్వారా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
కాశీబుగ్గలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో (Kashibugga) వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడం విచారకరమని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన బాధాకరం. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి గురించే నా ఆలోచనంతా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని పీఎంఓ కార్యాలయం ప్రకటించింది. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ.. ‘‘తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని విచారం వ్యక్తం చేశారు.
ఇలా జరుగుతుందని ఊహించలేదు – ఆలయ నిర్వాహకులు హరి ముకుంద్‌పండా
కాశీబుగ్గ (Kashibugga) తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి రెండు వేల మంది వరకు భక్తులు వస్తుంటారని, ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని ఊహించలేదని తెలిపారు. ‘‘భక్తులకు ప్రసాద వితరణ చేసి పంపిస్తాను. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇంత మంది వస్తారని తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వలేదు’’ అని అన్నారు. ఆలయంలోనే హరిముకుంద్ పండాతో కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. అనంతరం బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆలయ పరిసరాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆలయ ఆవరణలోనే హరిముకుంద్‌పండా కూడా ఉన్నారు.
కాశీబుగ్గ బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి లోకేశ్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని (Kashibugga) వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున సాయం అందిస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున సాయం చేస్తామని ప్రకటించారు. కాశీబుగ్గలోని ఘటనా స్థలితో పాటు, పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘94 ఏళ్ల వృద్ధుడు సొంత ఖర్చుతో వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించారు. ఇంత మంది భక్తులు వస్తారని ఎవరూ ఊహించలేదు. బారికేడ్లు ఏర్పాటు చేసినా రద్దీ కారణంగా సరిపోలేదు. విషయం తెలిసిన వెంటనే మంత్రి, ఎమ్మెల్యే, అధికారులను అప్రమత్తం చేశాం. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రజలకు దేవుడిని దగ్గర చేయాలనే సదుద్దేశంతో ఈ ఆలయం నిర్మించారు. తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకులు, సిబ్బందిని ప్రశ్నిస్తాం. పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 మందికి ప్రాణాపాయం లేదు. తీవ్రగాయాలైన వారికి మెరుగైన చికిత్స అందిస్తాం’’ అని తెలిపారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు బాధితులను పరామర్శించిన వారిలో ఉన్నారు.
Also Read : CM Revanth Reddy: భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపాలి – సీఎం రేవంత్
The post Kashibugga Stampade: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిలాట ! 9 మంది మృతి ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
