Kitchen Tips | వంటింట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండే పదార్థాలు ఉల్లిపాయలు, ఆలుగడ్డలే! అందుకే, తక్కువ ధరలో దొరికినప్పుడు వీటిని ఎక్కువ మొత్తంలో కొనేస్తుంటారు. అయితే, వాటిని నిల్వ చేసేటప్పుడు కొన్ని చిన్నచిన్న పొరపాట్లు చేస్తుంటారు. దాంతో అవి త్వరగా పాడైపోతుంటాయి. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాల్సిందే!
ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలను ఒకే బుట్టలో, పక్కపక్కనే ఉంచకూడదు. ఎందుకంటే.. ఉల్లిపాయలు ‘ఇథిలీన్’ అనే వాయువును విడుదల చేస్తాయి. ఈ వాయువు వల్ల ఆలుగడ్డలు త్వరగా మొలకెత్తుతాయి. మెత్తబడి కుళ్లిపోతాయి.
ఆలుగడ్డలు, ఉల్లిగడ్డల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకూడదు. అలా చేస్తే.. ఆలుగడ్డల్లో ఉండే స్టార్చ్.. చక్కెరగా మారిపోతుంది. ఇలాంటి వాటిని వండుకొని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక ఉల్లిపాయల్ని ఫ్రిజ్‌లో పెడితే.. మెత్తగా, జిగురుగా మారిపోతాయి.
ఆలుగడ్డలకు నేరుగా ఎండ తగిలితే ఆకుపచ్చగా మారుతాయి. అలా రంగు మారిన ఆలుగడ్డల్ని తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే! అందుకే.. వీటిని చీకటిగా ఉండే పొడి ప్రదేశంలోనే ఉంచాలి.
ఉల్లిపాయలకు గాలి ఎక్కువగా తగిలితే అవి తాజాగా ఉంటాయి. తేమ లేని ప్రదేశంలో వీటిని నిల్వ చేయాలి.
ఇక ఈ రెండిటికీ నిత్యం గాలి తగిలేలా చూడాలి. రంధ్రాలు కలిగిన బుట్టలు, జ్యూట్ బ్యాగులలోనే నిల్వ చేయడం మంచిది. అలా కాకుండా ప్లాస్టిక్ కవర్లలో ఉంచితే.. లోపల తేమ పెరిగి కుళ్లిపోయే అవకాశం ఉంటుంది.
