యువ ఫోక్ సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్న మైథిలి ఠాకూర్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. 25 ఏళ్ల మైథిలీ ఠాకూర్ కు దర్బంగాలోని అలీనగర్ అసెంబ్లీ నియోజకర్గం నుంచి బీజేపీ టిక్కెట్ కేటాయించే అవకాశం ఉంది. బిహార్‌లోని మధుబని జిల్లా బేనిపట్టికి చెందిన ఠూకూర్ గతంలో రాజకీయాల్లోకి చేరాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గం నుంచి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందన్నారు. తన నియోజకవర్గంతో ఎంతో అనుబంధం ఉందని చెప్పారు.
ఎవరీ మైథిలీ ఠాకూర్ ?
మైథిలీ ఠాకూర్‌ను బిహార్ ‘స్టేట్ ఐకాన్’గా ఎన్నికల కమిషన్ నియమించింది. రాష్ట్రానికి సాంస్కృతిక అంబాసిడర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. క్లాసికల్, ఫోక్ సంగీతంలో శిక్షణ పొందిన ఆమెకు బిహార్ ఫోక్ మ్యూజిక్‌కు చేసిన సేవలకు సంగీత నాటక అకాడమీ 2021లో ఉస్తాద్ బిస్మిల్మా ఖాన్ యువ పురస్కారం అందజేసింది. ఈ నేపథ్యంలో మైథిలీ ఠాగూర్ గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకున్నారు. 2024 జనవరిలో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంలో ఆమె పాడిన ‘మా శబరి’ పాటను ప్రధాని ప్రశంసించారు.
బిహార్ ఎన్నికలకు 71 మందితో బీజేపీ తొలి జాబితా
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి బీజేపీ తన తొలి జాబితాను మంగళవారం విడుదల చేసింది. మొత్తం 71 స్థానాలకు పేర్లను ప్రకటించింది. ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీ తారాపుర్ నుంచి పోటీ చేయనున్నారు. మరో డిప్యూటీ సీఎం విజయ్‌కుమార్ సిన్హా లఖిసరాయ్ నుంచి బరిలో దిగనున్నారు. మంత్రులు నితిన్ నబీన్… బాంకీపుర్, రేణు దేవీ.. బేతియా, మంగల్ పాండే సీవాన్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ (BJP) మొత్తం 101 స్థానాల్లో పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఈమేరకు ఎన్డీయే (NDA) కూటమి పార్టీల మధ్య ఇటీవల సీట్ల సర్దుబాటు ఖరారైంది. కొన్ని నియోజకవర్గాలను అటూఇటూ మార్చుకోవడంపై మంతనాలు సాగుతున్నాయి. ఏ పార్టీ ఎక్కడినుంచి పోటీ చేస్తుందనేదానిపై జరుగుతున్న చర్చలు తుదిదశకు చేరుకున్నట్లు ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీ తెలిపారు. ఈ క్రమంలోనే కాషాయ పార్టీ తొలి జాబితా విడుదలైంది. బిహార్‌లో వచ్చే నెల 6, 11వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబరు 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
The post Maithili Thakur: బీజేపీలో చేరిన బిహార్ ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
