కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ (BRS) శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల నేతలు కలిసి స్థానిక ఎన్నికలని అడ్డుకున్నారని ఆరోపించారు.
బీసీ రిజర్వేషన్‌కి కట్టుబడి 42శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని… తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిపి ఆమోదించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తూర్పు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ నిధులు అందించామని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం రూ.200 కోట్ల నిధులను తమ ప్రభుత్వం కేటాయించిందని ప్రకటించారు మంత్రి కొండా సురేఖ. త్వరలోనే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకి భూమి పూజ చేస్తామని వివరించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు అందించామని స్పష్టం చేశారు. త్వరలోనే వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తామని వెల్లడించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వేశామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
మంత్రుల మధ్య విభేదాలపై స్పందించిన మంత్రి ఉత్తమ్
ఇరిగేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు అవాస్తవమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తన శాఖ, తన జిల్లా అభివృధి పనులపై తాను ఫోకస్ పెట్టానని వ్యాఖ్యానించారు. మంత్రుల మధ్య సమన్వయం ఉందని.. విబేధాలు లేవని క్లారిటీ ఇచ్చారు. మంగళవారం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.
ఈ సందర్భంగా తన శాఖలో బదిలీలు నిబంధనల ప్రకారం జరిగాయని…. ప్రాసెస్ అంతా తానే దగ్గరుండి చూశానని చెప్పుకొచ్చారు. నీటి వాటాల్లో తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని ఉద్ఘాటించారు. కర్ణాటకలో కాంగ్రెస్, మహారాష్ట్రాలో బీజేపీ, ఏపీలో టీడీపీ ఉన్నా తమ హక్కులను వదులుకోబోమని స్పష్టం చేశారు. బనకచర్ల, ఆల్మట్టిపై తాము నిబంధనల ప్రకారం ఫైట్ చేస్తున్నామని తెలిపారు. కృష్ణా, గోదావరిలో నీటి వాటాల కోసం తమ ప్రభుత్వం కమిట్‌మెంట్‌తో పనిచేస్తోందని పేర్కొన్నారు. త్వరలోనే తాము మహారాష్ట్ర వెళ్తున్నామని చెప్పుకొచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
కేసీఆర్ పదేళ్లలో చేసింది ఏమీలేదని ఆక్షేపించారు. కాళేశ్వరం పేరుతో మిగతా ప్రాజెక్టులను కేసీఆర్ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం నీళ్లు లేకున్నా… భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పంటలు పండాయని నొక్కిచెప్పారు. ధాన్యం కొనుగోలు కోసం రూ.25 వేల కోట్లు రైతులకు కేటాయిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
The post Minister Konda Surekha: బీఆర్ఎస్ సోషల్ మీడియాపై మంత్రి కొండా సురేఖ ఫైర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
