Nara Lokesh : ఏపీలో అభివృద్ధి బుల్లెట్ ట్రైన్ లా దూసుకుపోతుందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని.. ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని ఆయన స్పష్టం చేసారు. చరిత్ర సృష్టించాలి అంటే అది చంద్రబాబు వల్లే సాధ్యం అవుతుందన్నారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ తో ఒప్పందం చేసుకున్న సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ (Nara Lokesh) మాట్లాడుతూ… ‘‘గూగుల్ డేటా సంస్థ విశాఖకు రావడం చాలా గర్వంగా ఉందన్నారు. కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు… ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తున్నాయి. గూగుల్ పెట్టుబడితో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖ వచ్చినప్పుడు వారితో సమావేశమయ్యాను. వారికి డేటా సెంటర్ స్థలాన్ని చూపించాం. ఇది జరిగిన నెల రోజుల్లో యూఎస్ వెళ్లి గూగుల్ క్లౌడ్ నాయకత్వాన్ని కలిశా. నవంబర్‌లో గూగుల్ ప్రతినిధులు సీఎంను కలిశారు. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు అనేకసార్లు భేటీ అయ్యారు. అనేక చర్చల తర్వాత ఇంత పెద్ద పెట్టుబడి సాధ్యమైంది. భారీ పెట్టుబడులపై అన్ని చోట్లా చర్చలు జరుగుతున్నాయి.
Nara Lokesh – అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యం – మంత్రి లోకేశ్
ఒకే రాష్ట్రం… ఒకే రాజధాని… అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యం. అనంతపురం, కర్నూలుకు పంప్డ్ స్టోరేజ్, సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి. చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్‌ను తీర్చిదిద్దుతున్నాం. శ్రీసిటీ గ్రేటర్ ఎకోసిస్టమ్‌లో అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నాం. డైకెన్, బ్లూస్టార్, ఎల్జీ పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోంది. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వాను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఉత్తరాంధ్రలో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. ఎంవోయూలపై సంతకాలు కాదు.. ఆచరణలో చేసి చూపిస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నాం. ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఛాలెంజ్‌గా తీసుకున్నాం. ఏ ఒక్క కంపెనీ కూడా మన రాష్ట్రం నుంచి వెళ్లే పరిస్థితి రాదు. గత ఐదేళ్లలో ఏపీలో విధ్వంసం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి.. ఏపీలో మాత్రం డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. దిల్లీలో ప్రధాని మోదీ, ఏపీలో సీఎం చంద్రబాబు కలిసి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైంది.
Nara Lokesh – నవంబర్‌లో మరిన్ని శుభవార్తలు వింటారు
చరిత్ర సృష్టించాలన్నా.. తిరగరాయాలన్నా చంద్రబాబుతోనే సాధ్యం. ఆనాడు కియా ఏర్పాటుతో చరిత్ర సృష్టించాం. విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెడుతోంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అతిపెద్ద విజయం. నవంబర్‌లో మరిన్ని శుభవార్తలు ఉంటాయి. వైకాపా పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. డేటా సెంటర్ అంటే ఏంటో గతంలో పనిచేసిన మంత్రికి తెలుసా? నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు యూనిట్‌కు 13 పైసలు తగ్గేలా చర్యలు తీసుకుంటాం’’ అని నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు.
వాటిని నమ్మే పరిస్థితి లేదు
ఐదేళ్లలో గూగుల్ మొత్తం 15బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోందని తెలిపారు. ఇతర రాష్ట్రాలకంటే భిన్నంగా ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామన్నారు. గూగుల్‌తో ఒప్పందానికి నెల రోజుల కాలవ్యవధి పెట్టుకున్నామని… ఒక నెల సమయం అదనంగా పట్టిందని తెలిపారు. డేటా సెంటర్లు, ఏఐ విధానాలకు తగ్గట్టుగా విద్యా వ్యవస్థ సిలబస్‌లో మార్పులు తెస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దంటూ వైసీపీ పేటీఎం బ్యాచ్‌లు పెట్టే తప్పుడు మెయిల్స్ ఇప్పుడు పెట్టుబడిదారులు ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. డేటా సెంటర్ అంటే ఏంటో గత కోడిగుడ్డు మంత్రికి తెలుసా అంటూ మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Also Read : Minister Konda Surekha: బీఆర్ఎస్ సోషల్ మీడియాపై మంత్రి కొండా సురేఖ ఫైర్
The post Minister Nara Lokesh: అభివృద్ధిలో బులెట్ ట్రైన్‌లా దూసుకెళ్తున్నాం – మంత్రి నారా లోకేశ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
